దేశవ్యాప్తంగా సోమవారం నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరచుకోనున్నాయి. దాదాపు 80 రోజుల తరువాత భక్తులు తమ ఇష్ట దైవాలను కనులారా దర్శించుకునే అవకాశం దక్కనుంది. అయితే వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ... భక్తులు కరోనా నివారణ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేరళలోని ప్రసిద్ధ శబరిమల, అనంత పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాలు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి.
శబరిమల అయ్యప్ప దేవాలయం
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం మాత్రం జూన్ 14న తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14న స్వామివారికి మిధననమాస పూజోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు కనులారా తమ స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దర్శన వేళలు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, తరువాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. గంట వ్యవధిలో గరిష్ఠంగా 200 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. గర్భగుడిలోకి 50 మందిని, స్వామివారి అంతరాలయంలోకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు.. కేరళ ప్రభుత్వ ఈ-జాగ్రత్త పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పం, అరవణ ప్రసాదం కోసం కచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. నెయ్యాభిషేకానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ నెలవారీ పూజలు పూర్తయిన తరువాత జూన్ 28న ఆలయాన్ని మూసివేస్తారు.