రాజకీయ దిగ్గజం నవీన్ పట్నాయక్ ఒడిశా... ఈ రాష్ట్రం గురించి వినగానే వెంటనే గుర్తొచ్చే పేరు నవీన్ పట్నాయక్... 19 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఈయన. బిజూ జనతా దళ్(బిజేడీ)ని ముందుండి నడిపిస్తున్న ఈయన మరో సారి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఒడిశా రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
బాల్యం...
స్వతహాగా రచయిత అయిన పట్నాయక్ ఎక్కువ కాలం ఒడిశా బయటే గడిపారు. దెహ్రాదూన్‌లో పాఠశాల స్థాయి విద్య అభ్యసించారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందారు. మంచి విద్యావేత్త అయిన ఈయన హిందీ, ఫ్రెంచ్, పంజాబీ, ఇంగ్లీష్ మాట్లాడగలరు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి..
1997లో నవీన్ తండ్రి, బిజూ జనతా దళ్ వ్యవస్థాపకుడు బిజూ పట్నాయక్ మరణించారు. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. అనంతరం వాజ్‌పేయీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
భాజపాతో ప్రయాణం..
2000 సంవత్సరంలో నవీన్ సారథ్యంలో బీజేడీ.... భాజపాతో కలిసి మొదటి సారిగా ఎన్నికలకు వెళ్లింది. ఈ కూటమి విజయం సాధించగా... కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయ్యారు నవీన్.
2004 ఎన్నికల్లో ఎన్డీఏలోనే పోటీ చేసింది బీజేడీ. కేంద్రంలో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కూటమి తరపున మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. కందమల్ దాడుల దృష్ట్యా 2009లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. వామపక్షాలతో కూడిన తృతీయ కూటమిలో చేరారు. మళ్లీ పదవి చేజిక్కించుకున్నారు.
మోదీ హవా మధ్య భారీ మెజారిటీ..
2014లో మోదీ హవా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 147 నియోజకవర్గాల్లో 117 స్థానాలను గెలుచుకొని నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు నవీన్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 16, భాజపా 10 స్థానాలకే పరిమితం కావడం విశేషం. గత ఎన్నికల్లో లోక్‌సభలోనూ బీజేడీది తిరుగులేని ఆధిపత్యమే. 21 స్థానాల్లో 20 బీజేడీవే. భాజపా ఒక స్థానమే దక్కించుకుంది.
ఈసారి ఎన్నికల్లో బీజేడీ 112 స్ఠానాల్లో గెలుపొంది ఘనవిజయం సాధించింది. లోక్‌సభకూ 21 స్థానాలకు 12 గెలుపొందింది. భాజపా ఈసారి 8 స్థానాలు దక్కించుకుంది.