భారత్‌లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు మిలియన్ టెస్టులే లక్ష్యంగా పరీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ నేడు ఆ లక్ష్యాన్ని దాటింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 10.23 లక్షల టెస్టులు నిర్వహించారు. ఒక్కరోజే మిలియన్ టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకుంది. ప్రతి పదిలక్షలకు టెస్టుల సంఖ్య దాదాపు 25 వేలుగా ఉంది.
దేశంలో తొలిసారి ఒక్కరోజే 10 లక్షల టెస్టులు - దేశంలో కరోనా పరీక్షలు
కరోనా టెస్టుల విషయంలో భారత్ రికార్డు సృష్టించింది. తొలిసారిగా 24 గంటల్లో 10 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే గత 21 రోజుల్లో కోలుకున్న వారి సంఖ్య 100 శాతం పెరిగిందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 74.28 శాతం మందికి వైరస్ నయమైంది.
తొలిసారిగా మిలియన్ టెస్టులు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచి బాధితులను త్వరగా గుర్తించడం ద్వారా రికవరీ రేటు కూడా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో రికవరీలు వంద శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 63 వేలకుపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 74.69 శాతంగా ఉంది.
ఇక కొత్తగా 69,878 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 29,75,701కి చేరింది.