నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల్లో... పంజాబ్‌లో 1,561 సెల్‌ఫోన్ టవర్లు ధ్వంసమైనట్లు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ మేరకు టెలికాం సర్వీసులకు అంతరాయం కల్గించేలా.. టవర్లను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని ఉపేక్షించనని తేల్చిచెప్పారు అమరీందర్ సింగ్. ఎన్ని విజ్ఞప్తులు చేసినా విస్మరిస్తున్నందున తన వైఖరిని కఠినతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మొబైల్ సేవలకు అంతరాయం కలిగితే.. సాధారణ పౌరులతో పాటు వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, బ్యాంకింగ్ రంగానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అమరీందర్ చెప్పారు. హింస ఉపయోగించడం వల్ల రైతుల ఆందోళన ప్రజలకు దూరమవుతుందని.. ఇది వ్యవసాయ సమాజ ప్రయోజనాలకు హానికరమని స్పష్టం చేశారు.