బంగాల్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల సీనియర్ డాక్టర్లు సుమారు 100 మందికి పైగా రాజీనామాలు చేశారు.
ప్రధాన వైద్య కళాశాలల అధినేతలు, డాక్టర్లు.. కోల్కతా, బుర్ద్వాన్, డార్జిలింగ్, ఉత్తర 24 పరగణాల జిల్లాలకు చెందిన 100 మందికి పైగా డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి రాజీనామాలు సమర్పించారు.
''ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడికి నిరసనగా... మేం వైద్యుల సమ్మెకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. మా భద్రత, రక్షణ డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ''
- డా. పి. కుందు, కలకత్తా స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ డైరెక్టర్
ప్రస్తుత పరిస్థితుల్లో కనీస సిబ్బంది లేకుండా నిరవధికంగా తమ సేవలు కొనసాగించలేమని రాజీనామా లేఖలో తెలిపారు. ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల ప్రిన్సిపల్, మెడికల్ సూపరింటెండెంట్లు గత రాత్రే రాజీనామాలు సమర్పించారు.
మమత క్షమాపణలు చెప్పాల్సిందే...
సమ్మె విరమించాలంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు వైద్యులు. మరో ఆరు డిమాండ్లను పరిష్కరించాలని మమత ముందుంచారు. వాటిని పరిష్కారానికి హామీ ఇస్తేనే.. తిరిగి విధుల్లోకి చేరుతామని తేల్చిచెప్పారు.