తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం..  లక్ష దాటిన కేసులు - corona virus cases latest news

భారత్​లో కరోనా మహమ్మారి ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రాల సమాచారం ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3లక్షలు దాటింది.

over-1-lakh-corona-cases-reported-in-maharashtra
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. లక్ష దాటిన కేసులు

By

Published : Jun 12, 2020, 8:38 PM IST

దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. కేంద్రం ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 2,97,535కు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో 3 లక్షల 817 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 వేల 552 మంది కరోనా కాటుకు బలయ్యారు. లక్షా 49 వేల 393 మందికి వైరస్​ నయమైంది.

మహాలో ఉగ్రరూపం..

దేశంలో వైరస్​ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. కొత్తగా 3వేల 493 మంది వైరస్ బారినపడ్డారు. మరణాల సంఖ్య 3వేల 717కు పెరిగింది. ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే ధారావిలో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 2వేలు దాటగా.. మృతుల సంఖ్య 77కు చేరింది

మహారాష్ట్రలో గత రెండు రోజుల్లో 129 మంది పోలీసులకు కరోనా సోకింది. వీటితో మహారాష్ట్ర పోలీసు విభాగంలో కరోనా కేసులు 3 వేల 388కి చేరాయి. వీరిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

మళ్లీ లాక్‌డౌనా?

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ అక్కడ కొత్తగా మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. అలాంటి నిర్ణయమేదీ తమ ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అందరూ పాటించాలని, జన సమూహాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

తమిళనాడులో అంతకంతకూ..

తమిళనాడులో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట పడటం లేదు. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 1982 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 40 వేల 698కి చేరింది. ఇప్పటివరకు 367 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 వేల 47 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌లో 42 మంది పీ.జీ వైద్య విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయ్యింది.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా నమోదైన 271 కరోనా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 6 వేల 516కి ఎగబాకింది. వీరిలో 79 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3 వేల 440 మందికి వ్యాధి నయమైంది.

యూపీలో 525 కొత్త కేసులు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 528 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 12 వేల 616కి ఎగబాకింది. మరో 20 మంది కరోనా కాటుకు బలి కావడంతో మృతుల సంఖ్య 365కి పెరిగింది. ఉత్తరాఖండ్‌లో మరో 37 మంది కరోనా బారినపడగా మొత్తం కేసులు 1692కి చేరాయి. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో..

రాజస్థాన్‌లో మరో 92 పాజిటివ్‌ కేసులు నిర్ధరణయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11వేల 930కి చేరింది. 269మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశాలో కొత్తగా 112..

ఒడిశాలో కొత్తగా 112 మందికి కోవిడ్-19 ఉన్నట్లు తేలగా బాధితుల సంఖ్య 3వేల 498కి పెరిగింది. కరోనా కారణంగా 9మంది చనిపోయారు.

లాక్‌డౌన్‌ను పొడిగించం..

కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించమని శుక్రవారం దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో పొడిగింపుపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేసింది. దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ను పొడిగించం’ అని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం నుంచి ‘రీలాక్ దిల్లీ ’అనే పదం ట్విట్టర్​ ట్రెడింగ్‌లో ఉంది.

పరిస్థితులు భయానకం..

కరోనా రోగుల చికిత్స, కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసును సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారించింది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలు ఆస్పత్రుల వార్డుల్లో, గార్బేజీలో పడేసిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్ కౌల్ అన్నారు. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ, పశ్చిమ బంగ, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details