ఎన్నో సుగుణాలు కలిగిన పసుపును...భారత్‌లో ఎక్కువగా వంటకాల్లో వినియోగిస్తారు. పసుపు వేయని కూర కంటికింపుగా కనిపించదనడం అతిశయోక్తి కాదు. పసుపులోని ఔషధ గుణాలు...శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్ని విలువలున్న పసుపు...ఒడిశా, కోరాపుట్ జిల్లాలోని కొండప్రాంతంలో ఉన్న తిమజోలా గ్రామస్థులకు బతుకుదెరువునిస్తోంది. ఈ గ్రామంలో ఉండే దాదాపు 100 కుటుంబాల్లో ఎక్కువశాతం పసుపునే పండిస్తారు. ఎన్నో తరాలుగా పసుపు సాగే వీరికి జీవనాధారం. తాతలు, ముత్తాతల కాలం నుంచి ఇదే సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. అది కూడా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా, పూర్తి సేంద్రీయ పద్ధతుల్లోనే. గ్రామంలోని 70 నుంచి 80 ఎకరాల్లో పండించే పసుపు అంతా....పాతకాలం నాటి సంప్రదాయ పద్ధతుల్లోనే సాగవుతోందని గ్రామరైతులు చెప్తున్నారు. సేంద్రీయ ఎరువులు వాడి పండించిన ఈ పసుపునకు..రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. గ్రామస్థులూ మంచి లాభాలే ఆర్జిస్తున్నారు.
"మొదట్లో వ్యాపారులు మా వద్ద పసుపు కొనుగోలు చేసేవారు. గతేడాది నుంచే అటవీశాఖ అధికారులు అన్ని గ్రామాల రైతుల నుంచి పసుపు పంట కొంటున్నారు."
-- సుకాంతి పాస్కా, పసుపురైతు
"అటవీ శాఖ నుంచి గతేడాది మా పంటకు మంచి ధర లభించింది. పోయినసారి 90 రూపాయలకు అమ్మితే, ఈసారి 100 రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ మంచి లాభాలు రాలేదు. మా బ్యాంకు అకౌంట్లలో డబ్బు వేస్తారు."
--భవానీ పాస్కా, పసుపురైతు
లక్ష్మీపూర్‌లో పండే పసుపులో నూనెశాతం ఎక్కువ. ఎలాంటి రసాయన ఎరువులూ వాడకుండా పండిస్తున్నందున పుష్కలమై ఔషధ గుణాలుండే ఈ పసుపునకు వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. తిమజోలా సహా...మరో 30 గ్రామాల్లోని రైతులు ఈ పద్ధతులనే అనుసరించి పసుపు సాగు చేస్తున్నారు. ఏడాదికి 100 టన్నులకు పైగా పసుపు...ఈ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ మార్కెట్లకు చేరుతోంది. 5.67 నుంచి 6.64శాతం కర్క్యుమిన్ ఉంటుందని ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సంఘం.. ఓఆర్ఎంఏయస్ జిల్లా అధ్యక్షుడు రోషన్ కార్తీక్ చెప్తున్నారు. నాణ్యతపరమైన పరీక్షల కోసం లఖ్‌నవూలోని సీఎస్ఆర్, ఎన్బీఆర్ఐ శాస్త్రవేత్తల వద్దకు పంపిస్తున్నట్లు చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఓఆర్ఎంఏయస్ అధికారులు...బాయిలర్, డ్రైయర్ యంత్రాలతో ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పారు.