'ఎన్నికల తర్వాత విపక్ష కూటమి ఏర్పాటు సాధ్యమే' సార్వత్రిక ఎన్నికల అనంతరం విపక్షాలన్నీ కూటమి ఏర్పాటు చేయడం సాధ్యమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భాజపా ఓటమి అనివార్యమని ఆయన పీటీఐతో ముఖాముఖిలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (భాజపా) ఓటమే తమ ప్రథమ కర్తవ్యమన్న రాహుల్, దేశంలో ప్రతిచోటా భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు.
"విపక్షాల ప్రథమ కర్తవ్యం ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడం. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇది అనివార్యం. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న భాజపాను అడ్డుకోవాలి. భారతదేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి. ఉద్యోగాలు సృష్టించాలి. ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలి. అందరికీ సమన్యాయం అందించాలి. ఇందుకోసం భాజపాయేతర పార్టీలన్నీ ఏకం కావాలి."
-పీటీఐ ముఖాముఖిలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పశ్చిమ బంగలో తృణమూల్ కాంగ్రెస్, దిల్లీలో ఆప్,... భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే వీటిని కలుపుకొనిపోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న విమర్శలపై రాహుల్ స్పందించారు.
"వివిధ రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. అందరి లక్ష్యం భాజపాను ఓడించడం. ప్రస్తుతానికి కాంగ్రెస్ కొన్ని ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటుచేయనప్పటికీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు."
- పీటీఐతో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు