పార్లమెంటులో తమ గళాన్ని ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణచివేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) వంటి కీలక అంశాలను లేవనెత్తకుండా విపక్షాలను కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించాయి. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ దేశరాజధాని దిల్లీలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రజలను హింసాకాండవైపు ప్రేరేపించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ.
"భాజపా మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టేలా, కలహాలు సృష్టించేలా ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న దిల్లీలో చేసిన ప్రకటనలు అసమ్మతం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బాధ్యతాయుతమైన వ్యక్తి.. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు. ప్రజల్ని తుపాకితో కాల్చాలని, పరలోకాలకు పంపాలని అంటున్నారు. ఈ వ్యాఖ్యలకు భాజపా క్షమాణలు చెప్పాలి. "
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత.