తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..? - రాజకీయం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సంగ్రామం. దాదాపు 3 నెలల హోరాహోరీ ప్రచారం. సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయినా... మాటలయుద్ధం ఆగలేదు. ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గలేదు. ఫలితం రావడానికి ముందు గంటగంటకూ రాజకీయ కాక పెరుగుతోంది. ఎందుకిలా?

'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?

By

Published : May 22, 2019, 11:37 AM IST

పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు... ఎన్నికలు ఏవైనా కనిపించే వాతావరణం దాదాపు ఒకటే. పదునైన వ్యూహప్రతివ్యూహాలు, విస్తృత ప్రచారాలు, మాటల యుద్ధాలు. పోలింగ్​ ముగిశాక అంతా నిశబ్దం. మహా అయితే... 'ఎన్నికల అనంతర పొత్తులపై చర్చలు', 'సేదతీరుతున్న నేతలు' వంటి వార్తలు వస్తుంటాయి. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. మరికొద్ది గంటల్లో ఫలితం రానున్నా... ఎన్నికల రాజకీయ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రధాన కారణం 'ఈవీఎం'.

ఎందుకింత రగడ..?

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రం(ఈవీఎం).... దిగ్గజ నేతల రాజకీయ భవితవ్యంపై ప్రజాతీర్పును నిక్షిప్తం చేసుకుని ఉన్న చిన్న యంత్రం. బటన్​ నొక్కితే... జాతకం బయటపడుతుంది. నవ భారత పాలనా పగ్గాలు చేపట్టే తదుపరి నేత ఎవరో తేలుతుంది. అందుకే ఈవీఎంకు అంత ప్రాధాన్యం.

అగ్రరాజ్యాల్లోనూ ఎన్నికలు జరిగేది ఇప్పటికీ బ్యాలెట్​ పద్ధతిలోనే. భారత్​లో మాత్రం ఈవీఎంల ద్వారా నిర్వహించడం... సాంకేతికంగా మన అభివృద్ధికి ప్రతీక. గర్వించాల్సిన విషయం... ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు ప్రధాన కారణం... ఈవీఎం ట్యాంపరింగ్​ ఆరోపణలు.

ఈవీఎంలను హ్యాక్​ చేసి, ప్రజాతీర్పును మార్చేయవచ్చన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అవి మరింత ఎక్కువయ్యాయి. కొన్ని ఈవీఎంలు స్ట్రాంగ్​రూములకు బదులుగా బయట కనిపించడం, మరికొన్ని సందర్భాల్లో ఈవీఎంలను నిర్దేశిత ప్రాంతాల నుంచి తరలించారన్న వార్తలు... ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. విపక్షాల ఆందోళనలకు ఆజ్యం పోశాయి. నేరుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ స్పందించేందుకు కారణమయ్యాయి.

'చీటీ' లెక్కలపై దుమారం...

ఈవీఎం ట్యాంపరింగ్​ అనుమానాలకు తెరదించేందుకు తీసుకొచ్చిందే వీవీప్యాట్​(ఓటర్​ వెరిఫయబుల్​ పేపర్​ ఆడిట్​ ట్రయల్​). ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్యను, వీవీప్యాట్​ స్లిప్పులతో సరిపోల్చితే లెక్క పక్కాగా ఉంటుందన్నది ఆలోచన. కానీ... ఎన్ని ఈవీఎంల ఓట్ల సంఖ్యను, స్లిప్పులతో సరిపోల్చాలన్నదే అసలు వివాదం.

విపక్షాల న్యాయపోరాటం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్​ల స్లిప్పులు మాత్రమే లెక్కిస్తారు. అది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక. ఈ విధానం విపక్షాలకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.

ఆఖరి క్షణం వరకు పోరాటమే...!

నూటికి నూరు శాతం వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలన్నది విపక్షాల డిమాండ్​. అది సాధ్యంకాదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో నేతలు వ్యూహం మార్చారు. ముందుగా వీవీప్యాట్​లు లెక్కించాలని, తేడా వచ్చినచోట్ల 100శాతం స్లిప్పులు గణించాలన్నది తాజా డిమాండ్​. ఈ మేరకు మంగళవారం ఈసీకి మరోమారు వినతిపత్రం సమర్పించారు విపక్ష నేతలు. ఎన్నికల సంఘం మాత్రం ఎటూ తేల్చలేదు.

భాజపా వాదన...

ఎన్డీఏదే గెలుపని ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. ముందస్తు విజయోత్సాహంతో ఉన్న భాజపా... విపక్షాల 'ఈవీఎం ఉద్యమం'పై పెదవి విరుస్తోంది. అనవసర రాద్ధాంతంగా అభివర్ణిస్తోంది.
'రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ గెలిచినపుడు.. మమత, అమరీందర్​, కేజ్రీవాల్​ సీఎం అయినపుడు ఈవీఎంలు బాగానే ఉన్నాయి. ప్రజలు మోదీని మరోసారి ప్రధానిగా కోరుకుంటుంటే.. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తుతున్నాయా..?'

-కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​

ఏ క్షణం ఏదైనా...

రాజకీయాల్లో ఏ క్షణం ఏదైనా జరగొచ్చు. అర్ధరాత్రి కోర్టు నిర్ణయాలతో ప్రభుత్వాలే మారిన ఉదంతాలు ఉన్నాయి. అందుకే... విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈవీఎంల 'లెక్క' తేల్చేందుకు ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మిగిలి ఉన్న కొద్ది గంటల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను పెంచేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details