తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాగా'లతో చర్చలపై నీలినీడలేనా! - ఈశాన్యంలో రెండు దశాబ్దాలుగా రేగుతున్న మంటలు చల్లారతాయా

ఈశాన్యంలో రెండు దశాబ్దాలుగా రేగుతున్న మంటలు చల్లారతాయా..? నాగా వేర్పాటు సమస్యకు చర్చలతో పరిష్కారం లభిస్తుందా..? ఇరువర్గాల మొండివైఖరితో ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది సాధ్యం కాదనే అనిపిస్తోంది. తిరుగుబాటులో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎన్​ఎస్​సీఎన్​ అధ్యక్షుడు తుంగిలాంగ్ ముయివా లేకుండానే ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం అనేది అర్థం లేని చర్యగా చెప్పుకోవచ్చు.

'నాగా'లతో చర్చలపై నీలినీడలేనా!

By

Published : Oct 31, 2019, 8:12 AM IST

నాగా తిరుగుబాటుదారులతో సాగిస్తున్న చర్చలకు అక్టోబర్​ 31 వరకు గడువు నిర్ణయించింది కేంద్రం. ఆలోగా చర్చలను కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఇరువర్గాలు చూపిస్తున్న మొండివైఖరి కారణంగా ప్రస్తుతం ఈ చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాగా తిరుగుబాటుదారులతో చర్చలకు నిర్ణయించుకున్న గడువును అక్టోబర్​ 31 నుంచి పొడగించకుండా ఉండటం వల్ల 22 ఏళ్లుగా భారత ప్రభుత్వానికి, నేషనల్ సోషలిస్ట్​ కౌన్సిల్​ ఆఫ్​ నాగలిమ్​ (ఎన్ఎస్​సీఎన్-ఐఎమ్) కుమధ్య జరుగుతున్న చర్చలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి భారత్​లో సంపూర్ణంగా విలీనం చేసిన ప్రస్తుత తరుణంలో నాగా ప్రజల కోరుకుంటున్నట్లుగా ప్రత్యేక రాజ్యాంగం, జాతీయ పతాకం ఏర్పాటుకు భారత ప్రభుత్వం అంగీకరించడం అన్నది సాధ్యమయ్యేపనిగా కనిపించడం లేదు.

ఈ వైఖరితో చరిత్ర మరోసారి పునరావృతం అయ్యేలా ఉంది. 1975లో కుదుర్చుకున్న షిల్లాంగ్ ఒప్పందంతో నాగా ఫాక్షన్​కు బీజం పడింది. ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఎన్​ఎస్​సీఎన్​ అప్పటి నుంచే నాగా తిరుగుబాటు ఉద్యమంలో హింసాత్మక ఘట్టానికి తెరలేపింది.

ముయివా లేకుండానే ఒప్పందం!

దాదాపు 22 ఏళ్లుగా నాగా పోరాటాన్ని నడుపుతున్న నాయకుడు.. అసలు ఈ చర్చలకు మూల కారకుడు అయిన తుంగిలాంగ్ ముయివా(ఎన్​ఎస్​సీఎన్​ అధ్యక్షుడు) లేకుండానే ప్రభుత్వం.. నాగాలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది. అక్టోబర్ 31 తుదిగడువు కావడంతో మయువా చర్చల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే నాగాలాండ్ లోని నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్​(ఎన్​ఎన్​పీజీ)తో ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముయివాతో విభేదాల కారణంగా విడిపోయిన ఇతర సీనియర్ నాయకులు కూడా నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్​లో చేరే అవకాశం ఉంది.

తమకు స్వయం ప్రతిపత్తి, నాగా జాతీయ పతాకంతో పాటు ప్రత్యేక రాజ్యాంగం కోసం ముయివాతో పాటు అతని అనుచరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవేవీ లేకుండానే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి మరికొందరు తిరుగుబాటుదారులు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారందరికీ నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ ఓ వేదికలా మారింది. పలు నాగా గ్రూపులతో పాటు మాజీ తిరుగుబాటుదారులు, ఎన్​ఎస్​సీఎన్​ నుంచి విడిపోయిన నేతలకు నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ వేదికైంది. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యకు పరిష్కారం లభించక విసిగిపోయిన నాగాజాతి ప్రజలు దీనికి చరమగీతం పాడాలని అనుకుంటున్నారు. భారత్​తో సైనిక పోరాటం చేయగల సామర్థ్యం లేదన్న నిజాన్ని గుర్తించి.. తమ సమస్యకు త్వరగా ఓ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. వీరందరికీ ఎన్​ఎన్​పీజీ ఓ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది.

చర్చలు వదిలేస్తే మరిన్ని ఘర్షణలు

నాగా తిరుగుబాటు ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించి, ప్రభుత్వంతో చర్చలను ప్రారంభించిన వ్యక్తి లేకుండానే ఒప్పందం జరిగే అవకాశం ఉంది. నాగా తిరుగుబాటులో ప్రధాన భూమిక పోషించేది ఎన్​ఎస్​సీఎన్​(ఐఎం), ముయివాలే కాబట్టి వారు లేకుండా నాగాలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అనేది అర్థరహితమైనదనే చెప్పాలి. అయితే చర్చలలో ఇరుపక్షాలు చూపిస్తున్న మొండి వైఖరి కారణంగా 22 ఏళ్లుగా చర్చల్లో సాధించిన ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ఓ పరిష్కారానికి రాకుండా శాంతి చర్చలను గాలికి వదిలేస్తే మరిన్ని ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది. అసంపూర్తి చర్చల ద్వారా కేవలం ప్రజల నుంచి తిరుగుబాట్లు, ప్రభుత్వాల వైపునుంచి తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లే జరుగుతాయి. దీని వల్ల ఇటు ప్రభుత్వాలకు గానీ అటు నాగా ప్రజలకు గానీ ప్రయోజనం చేకూరే అవకాశం లేదు.

అసలేంటి కథ!

మొదటి ప్రపంచ యుద్ధంలో వాడుకోవడానికి బ్రిటీష్​ వారు నాగా యువకులను తీసుకెళ్లారు. యుద్ధంలో సైనికులకు సహాయం చేయడంతో పాటు భవనాలు, సైనిక శిబిరాలను నిర్మించడం సహా కందకాలు తవ్వడానికి వీరితో గొడ్డు చాకిరి చేయించుకున్నారు. దీంతో 1917లో మొదటిసారి నాగా ప్రజల మనసులలో స్వాతంత్ర్య కాంక్ష్య రగిలింది.
అప్పటివరకు చాలా తక్కువ లోకజ్ఞానం కలిగిన ఆ ప్రజలకు బయటి ప్రపంచానికి పరిచయం కావడం అదే మొదటిసారి. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోంలలో తమ జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారని వారికి అవగతమైంది. తామంతా ఒక్కటే అన్న భావన వారిలో ఏర్పడింది. తర్వాత 1918లో నాగా క్లబ్ ఏర్పడింది. బ్రిటీష్​వారు ఇండియాను విడిచిపెట్టి వెళితే తాము స్వతంత్రంగా ఉంటామని నాగా క్లబ్ సైమన్ కమిషన్​కు 1929లో మెమోరాండమ్​ అందించింది.

ప్రజలకు దారిచూపుతూ ఉద్యమాన్ని ముందుండి నడిపించే బాధ్యతను అంగామీ నాగా, ఝా ఫింఝోలకు వదిలిపెట్టారు. నాగాల సార్వభౌమత్వాన్ని కాపాడుతూ స్వాతంత్ర్యం సాధించడమే ప్రధాన లక్ష్యంతో ఉద్యమానికి ఊపిరిపోసే బాధ్యతలను అంగామీ నాగా, ఝా పింజోలు నిర్వర్తించాయి. జపాన్​ సైన్యం వదిలి వెళ్లిన ఆయుధాలతో పాటు చైనా నుంచి నిరంతర సాయసాకారాలు అందుతుండటం వల్ల వీరి ఉద్యమం మరింత రాటుదేలింది.

అయితే మారిన పరిణామాలలో, ప్రస్తుత పరిస్థితులలో స్వాతంత్ర్యం సాధించే డిమాండ్​ను పక్కనబెట్టి సార్వభౌమాధికారం మాత్రమే ఎన్​ఎస్​సీఎన్​(ఐఎం) కోరుతోంది. దీంతో భారత్​లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే నాగాలాండ్​కు ఎక్కువ అధికారాలు, స్వయంప్రతిపత్తి లభించేలా డిమాండ్ చేస్తోంది.

తిరుగుబాటుదారులు చైనావైపు!

వందలాది ఎన్​ఎస్​సీఎన్​ పోరాట యోధులు ఆయుధాలు ధరించి నాగాలాండ్​లోని తమ శిబిరాల నుంచి పొరుగున ఉన్న మయన్మార్​లోని రహస్య స్థావరాలకు, అక్కడి నుంచి చైనా భూభాగం వైపు వీరి కదలికలను గుర్తించినట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. చైనా దీనిని కచ్చితంగా అవకాశంగా తీసుకుంటుంది.

ఈశాన్య భారత్​లోని చాలావరకు తిరుగుబాటు గ్రూపులను యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్రన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఏకతాటిపైకి తీసుకువచ్చింది. యుఎన్​ఎల్​ఎఫ్​డబ్ల్యూఎస్​ఈఏ 2015లో స్థాపించిన ఈ సంస్థ వేలాది తిరుగుబాటు గ్రూపులు, పోరాట నాయకులకు మధ్య సయోధ్య ఉండేలా చేస్తోంది. ప్రభుత్వ అధీనంలో లేని 60 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతంలో ఈ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రభుత్వ అధీనంలో లేని ఈ ప్రాంతం ఉత్తరాన అరుణాచల్​ప్రదేశ్​ నుంచి దక్షిణాన మణిపూర్​ వరకు 1300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
కేంద్రం ఏకపక్షంగా చర్చలకు గడువు నిర్ణయించడం పట్ల తిరుగుబాటుదారులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చర్చల గడువును పొడిగించడం ఉత్తమం.

--సంజీబ్ బారువా

ఇదీ చూడండి : చిలీలో నిరసనలు- ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం

ABOUT THE AUTHOR

...view details