జమ్ముకశ్మీర్లో పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్ లోయ... భద్రతా బలగాల నీడలోకి వెళ్లింది. జమ్ము కశ్మీర్ హోంశాఖ ప్రకటనతో అమర్నాథ్ యాత్రకూ బ్రేక్ పడింది. పర్యటకులు, యాత్రికులు రాష్ట్రం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం వస్తోందన్న వదంతులు రాష్ట్రంలో షికార్లు చేస్తున్నాయి. ఫలితంగా కశ్మీర్ స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ముందస్తుగా సమకూర్చుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఏటీఎం, బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరారు.
ప్రభుత్వ చర్యల వెనుక కారణం తెలియక ఆందోళన పడుతున్నారు స్థానికులు.
"ప్రభుత్వం నిన్న విడుదల చేసిన ప్రకటనతో ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. కశ్మీరీ ప్రజల మనసు గెలుచుకునే పద్ధతి ఇది కాదు. పెట్రోల్ బంకుల్లో బారుల తీరిన ప్రజలను నియంత్రించడానికి పోలీసులను ఉపయోగిస్తున్నారు. మీరు కశ్మీరులో మంచి చేయాలనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి. మేం ఎన్నుకున్నవాళ్లు మా హక్కుల గురించి మాట్లాడతారు. యాత్రికులు, పర్యటకులను తిరిగి పంపిస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఎవరూ చెప్పట్లేదు."
-స్థానికుడు, బారాముల్లా
ప్రస్తుత పరిస్థితులను బట్టి యుద్ధం వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే అవసరమైన వస్తువులు కొనేందుకు కశ్మీరీలు పరుగులు పెడుతున్నారు.
"ఇక్కడ ఏం జరగబోతోందో ఎవరికీ తెలియట్లేదు. ప్రజలు యుద్ధం వస్తోందని భావిస్తున్నారు. నాకు కూడా యుద్ధం జరిగే అవకాశం ఉందని అనిపిస్తోంది."