ప్రభుత్వ ఉద్యోగం కోసం వివిధ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఒకే ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల నియామకం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
"గ్రూప్-బి, నాన్ గెజిటెడ్ పోస్టులతో పాటు గ్రుప్-బి గెజిటెడ్ పోస్టులు, గ్రూప్-సి పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేసే విధంగా ఒక ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం."
-సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గ్రూప్-బి, సి లతో పాటు వాటికి సమానమైన ఖాళీలను సైతం ప్రత్యేక ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది కేంద్రం.
ఇదీ పరీక్ష విధానం..
ప్రస్తుతం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు... కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో విద్యార్హత ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియెట్(12వ తరగతి), పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్షలో వచ్చిన మార్కులను అభ్యర్థులకు తెలియజేస్తారు. ఈ మార్కులను ఆయా ఏజెన్సీ(ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ)లకు అందిస్తారు.
మార్కులు మెరుగుపర్చుకోవడానికి ప్రతి అభ్యర్థికి మరో రెండు అవకాశాలు ఇస్తారు. వీటన్నింటిలో ఎక్కువ ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఈ మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.