సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్న ఉల్లిపాయల ధరలు త్వరలోనే దిగివస్తాయని చెప్పారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. నాఫెడ్ లాంటి ఏజెన్సీల ద్వారా ఉల్లిపాయల సరఫరా పెంచుతామని ఆయన వెల్లడించారు. రైతుల కోసం రెండు మొబైల్ యాప్లను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉల్లి పరిస్థితులపై ప్రభుత్వానికి అవగాహన ఉందని... రైతుల, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తోమర్ స్పష్టం చేశారు.
"మరికొద్ది రోజుల్లో ఉల్లిపాయల ధరలు దిగివస్తాయి. నాఫెడ్ తన వద్ద ఉన్న అదనపు నిల్వలను తక్కువ ధరకే సరఫరా చేస్తుంది. వ్యవసాయశాఖ వద్ద తగినంత స్థాయిలో ఉల్లి నిల్వలు ఉన్నాయి."
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
ప్రస్తుతం నిల్వ ఉన్న ఉల్లిపాయలు అమ్ముడవుతున్నాయని, నవంబర్ నాటికి కొత్త పంట మార్కెట్లో వస్తుందని తోమర్ పేర్కొన్నారు.