9 ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం కర్ణాటక హుబ్బళ్లి నగరం మహావీర్ వీధిలో ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం పెడుతోంది 'రోటీఘర్'. సర్కారు నుంచి ఎలాంటి సహకారం లేకుండా దాదాపు 9 ఏళ్ల నుంచి కేవలం రూ.1కే భోజనం అందిస్తోంది. ఈ పని చేస్తోంది ధనవంతులు కాదు. జైన వర్గానికి చెందిన 30 మంది యువకులు కలసి 1998లో 'మహావీర్ యూత్ ఫెడరేషన్' అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ జైన గురువు సలహా మేరకు 2009లో ఈ 'రోటీఘర్'ను ప్రారంభించారు.
'ఈ ఆహార కేంద్రాన్ని స్థాపించడానికి కారణం మహావీర్ జైన సమాజ్ సంస్థే. ఈ సేవా సంస్థకు జైన సమాజం ప్రోత్సాహమిస్తోంది. ఇందులో మొత్తం 30 మంది సభ్యులున్నాం. ఏ కులమనే తేడాలు చూడకుండా అందరికీ మంచి భోజనం అందిస్తున్నాం. సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం."
-సురేశ్ జైన్, మహావీర్ జైన సమాజ్ సభ్యుడు
రోజూ సుమారు 300 నుంచి 400 మంది ఇక్కడ రూపాయికే భోజనం చేస్తున్నారు.
"ఈ రోటీఘర్ మొదలై 9 ఏళ్లైంది. రూపాయికే రుచికరమైన భోజనం ఇస్తారు. ఎక్కడ ఉన్నా పిలిచి మరీ భోజనం పెడతారు. వీరిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది."
- సిద్ధప్ప, స్థానికుడు
ఒక్క పూట భోజనం తయారు చేయడానికి వీరికి సుమారు 7 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రూపాయికే భోజనం పెడతారు కానీ ఉచితంగా అందించడానికి మాత్రం ఇష్టపడరు. ఆ రూపాయిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు.