తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ: వరద బాధితుల కోసం 'నేను సైతం' - RAMOJI GROUP

ఎన్నడూ చూడని వరదలతో గతేడాది అతలాకుతలమైన కేరళ నెమ్మదిగా కోలుకుంటోంది. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముందుకొచ్చారు. దాతలు, లబ్ధిదారుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఎంతగానో ఉపకరించింది ఓ ఫేస్​బుక్​ పేజీ. ఆ పేజీ... ఓ తెలుగు వ్యక్తి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కావడం మరో విశేషం.

వరద బాధితుల సహాయార్థం 'ఐ యామ్ ఫర్ అలెప్పి' అనే ఫేస్​బుక్ పేజీ

By

Published : Jul 7, 2019, 8:04 AM IST

వరద బాధితుల సహాయార్థం 'ఐ యామ్ ఫర్ అలెప్పి' అనే ఫేస్​బుక్ పేజీ

కుండపోత వర్షం... పొంగిపొర్లిన వాగులు, వంకలు... ఎటు చూసినా నీళ్లే... భారీ వృక్షాలను, నిలువ నీడను లేకుండా తుడిచిపెట్టేశాయి ఆ వరదలు. ఆ ధాటికి అందాల కేరళ... అస్తవ్యస్తమైంది. ఏడాది గడిచినా ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు ఇలా ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారు.

కేరళకు తోడ్పాటు అందించేందుకు ఇంత మంది ముందుకు రావడం వెనుక అలెప్పీ జిల్లా యంత్రాంగం కృషి ఎంతో ఉంది. వరద బాధితుల సహాయార్థం 'ఐ యామ్ ఫర్ అలెప్పి' అనే ఫేస్​బుక్ పేజీని రూపకల్పన చేశారు అధికారులు. ఈ ఆలోచన కాస్తా అలెప్పి జిల్లా తిరిగి కోలుకునేంత సాయం అందేలా చేసింది.

అలెప్పి జిల్లా పాలనాధికారి, తెలుగువారైన వీఆర్ కృష్ణ ఈ పేజీ సాయంతో 500 ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టగలిగారు. ఇందులో 150 ఇళ్లను రామోజీ గ్రూప్ సంస్థ నిర్మిస్తుండగా 105 నివాసాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఒక్క ఆలోచన...

అలెప్పి జిల్లాను వీలైనంత త్వరగా తిరిగి యథాస్థితికి తీసుకురావాలన్నది జిల్లా పాలనాధికారి వీఆర్ కృష్ణతేజ లక్ష్యం. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి నివాసాలు సమకూర్చడాన్ని ఆయన ప్రథమ కర్తవ్యంగా భావించారు. జీవనాధారం కోల్పోయిన వారికి సాయమందించాలనుకున్నారు.

పాలడెయిరీ నిర్వహించిన వారికి పశువులను అందించాలని సంకల్పించారు. మహిళలకు కుటీర పరిశ్రమలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రి, మత్స్యకారులకు చేపలు పట్టేందుకు వలలు, పడవలు వంటి వాటిని సిద్ధం చేసేలా ప్రాజెక్టు రూపొందించారు.

ఉద్యమ స్థాయిలో...

'ఐ యామ్ ఫర్ అలెప్పి' కార్యక్రమంలో భాగంగా పశువులను అందిస్తున్నారు. కేరళలోనే ఈ పశువులను కొంటున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

దివ్యాంగులకు సామగ్రి...

నిత్యవసర సామగ్రి, వైద్యానికి అవసరమైన వస్తువులు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు వంటివి 1300 మందికి ఇప్పటివరకు అందించారు. ఇవన్నీ దాత నుంచి నేరుగా లబ్ధిదారునికి అందేలా పాలనాధికారి కృష్ణ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

మొక్కలూ నాటారు...

'ఐ యామ్​ ఫర్​ అలెప్పి'లో భాగంగా 50 లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో నడుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details