ఒడిశాకు చెందిన సూక్ష్మ చిత్రకారిణి గాయత్రి.. నాణేలపై అందమైన బొమ్మలు వేస్తూ అద్భుతాలు చేస్తున్నారు. తన నైపుణ్యంతో నాణేలపై అత్యంత సూక్ష్మమైన చిత్రాలు వేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. అంతేకాదు తన ప్రతిభతో పలు రికార్డులు కొల్లగొడుతున్నారు.
రూపాయి నాణెం మీద వేసిన చూడముచ్చటైన బొమ్మలకు 'అసాధారణ సూక్ష్మ చిత్రాల' విభాగంలో ప్రపంచ రికార్డు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున అవార్డు తీసుకున్నారు.
రూపాయి నాణేల వెనకవైపు సూక్ష్మ చిత్రాలు గీయడంలో తనకు తానే సాటి అని అనిపించుకుంటున్నారు గాయత్రి. ఇప్పటివరకు 100 నాణేలపై వివిధ రకాల పెయింటింగులు వేశారు. గణపతి, బుద్ధుడు, కోయి ఫిష్, తలుపులు, పుష్పాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, సీతాకోక చిలుకలు, పడవలు, ఓడలు... ఒక్కటేమిటి... తన కుంచె నుంచి జాలువారని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు.