కశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కాదని... ప్రత్యేక వివక్ష అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని.. ఇదే విషయాన్ని కశ్మీరీలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
"ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కాదు. అది ప్రత్యేక వివక్ష. ఆర్టికల్ రద్దుతో భారతీయులతో సమానంగా కశ్మీరీలను నిలబెట్టాం."
-అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు
జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 199 పోలీసు స్టేషన్ల పరిధిలో కేవలం 10 చోట్ల మాత్రమే ఆంక్షలు ఉన్నాయని, వంద శాతం ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. 92.5 శాతం జమ్ముకశ్మీర్ భూభాగంలో ప్రస్తుతం ఆంక్షలను ఎత్తేశామన్నారు.