కేంద్రం నిర్ణయం మేరకు జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్) చేపడుతామని తెలిపారు బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ. రాష్ట్రంలో మే 15 నుంచి 28 వరకు ఎన్‌పీఆర్ నమోదు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్ అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సుశీల్.
''జాతీయ జనాభా పట్టిక-2020 నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. బిహార్లో మే 15-28 మధ్య చేపడతాం.''
- సుశీల్ కుమార్ మోదీ, బిహార్ ఉప ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా.. ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న బంగాల్, కేరళ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. దమ్ముంటే పౌరచట్టం, ఎన్‌పీఆర్ అమలును నిలిపేయాలని అన్నారు మోదీ. పౌరసత్వంపై చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్న ఆయన ఎన్‌పీఆర్.. తప్పనిసరి నిబంధన అన్నారు. ఏ రాష్ట్రానికీ జాతీయ జనాభా పట్టిక అమలును తిరస్కరించే అధికారం లేదని సుశీల్ మోదీ అన్నారు.
జాతీయ జనాభా పట్టిక.. ఎన్‌ఆర్‌సీ కోసమేనని కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశీల్ మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.