తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎంలపై మరో మారు రచ్చ - EVM

ఈవీఎంల ట్యాంపరింగ్​పై మరోమారు దుమారం. బ్యాలెట్​ పత్రాలను వినియోగించాలని ప్రతిపక్షాలు డిమాండ్​. సోమవారం ఈసీని కలవనున్న 21 ప్రతిపక్ష పార్టీలు.

evm

By

Published : Feb 2, 2019, 2:50 AM IST

evm
దేశంలో రెండు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్​కు గురయ్యాయని, వాటి స్థానంలో బ్యాలెట్​ పత్రాలను ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఏ పార్టీకి ఓటు వేశామో తెలుసుకునేలా వీవీప్యాట్​లను ప్రవేశపెట్టింది ఈసీ. ఓటు వేసిన అనంతరం కొన్ని సెకన్ల పాటు ఎవరికి ఓటు వేసామో ఈ పరికరంలో చూసుకునే వీలుంటుంది. అయినప్పటికీ బ్యాలెట్​ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

ఆరోపణలకు ఆజ్యం

ఇటీవల భారత అమెరికన్​ హ్యాకర్​ భారత్​లో గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు టాంపరింగ్​కు గురయ్యాయని సంచలన ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాల ఆందోళన చేస్తున్నాయి.

బ్యాలెట్​ పత్రాలకు వెళ్లేది లేదు: ఈసీ

ఈవీఎంలపై వస్తున్న విమర్శలను భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోరా తిప్పికొట్టారు. ఎట్టిపరిస్థితుల్లో బ్యాలెట్​ పత్రాలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలు అత్యంత పకడ్బందీగా రక్షణ పరికరాల తయారీ సంస్థలు, సాంకేతిక నిపుణునుల బృందం పర్యవేక్షణలో నిర్మించినట్లు గుర్తుచేశారు.

"బ్యాలెట్​ పత్రాల కాలానికి తిరిగి వెళ్లేది లేదు. మన దేశంలో ఈవీఎంలు సుమారు రెండు దశాబ్దాల కాలానికి పైగా వినియోగంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు, భయాలను తెలియజేయడానికి హక్కు ఉంటుంది. ఎందుకంటే వారు ఓటర్ల తరువాత అతిపెద్ద భాగస్వాములు."
- సునీల్​ అరోరా, భారత ప్రధాన ఎన్నికల అధికారి.

ఈసీని కలవనున్న ప్రతిపక్షాలు

ఈవీఎంలపై ప్రజలకు చాలా అనుమానాలున్నాయని, వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. 21 విపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన 'సేవ్​ ది నేషన్​' సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలపై నివేదికను సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని సమస్యలనూ ఈసీకి విన్నవిస్తామన్నారు.

ఈసీకి నోటీసులు

వీవీపాట్​లను మరింత పారదర్శకంగా, దోషరహితంగా తయారు చేయాలని వచ్చిన పిటిషన్​పై బాంబే హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోపు స్పందించాలని ఆదేశించింది. వీవీపాట్​లలో రెండు స్థాయిల్లో ట్యాంపరింగ్​కు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్​ పేర్కొన్నారు. అప్లికేషన్​ సాఫ్ట్​వేర్​ అప్​లోడ్​ సమయంలో, రాజకీయ పార్టీల గుర్తులను అప్​లోడ్​ చేసే సమయంలో ట్యాంపరింగ్​కు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details