భారీ వర్షాలతో వణికిన ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగి పడ్డాయి. పంజాబ్, హరియాణాలో భారీ వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద మృతుల సంఖ్య 42కు చేరింది.
దిల్లీ...
దేశ రాజధాని దిల్లీలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హరియాణా నుంచి వస్తున్న వరదలే ఇందుకు కారణం. యమునా నది ప్రవాహం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పైనుంచి మరింత నీరు విడుదల కావడం వల్ల దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని దిల్లీ సీఎం కేజ్రివాల్ వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్...
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. రోడ్లు, విద్యుత్, తాగునీటి వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్దరిస్తున్నట్లు పేర్కొన్నారు. మండి జిల్లా చత్రులో చిక్కుకుపోయిన కేరళ నటి మంజు వారియర్ సహా... ఆమె చిత్ర బృందాన్ని అధికారులు రక్షించారు.