తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2019, 7:00 AM IST

ETV Bharat / bharat

అక్రమ వలసపై వక్ర రాజకీయం... అట్టుడుకుతున్న ఈశాన్యం

ఎన్​డీఏ సర్కారు తెచ్చిన తాజా పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య భారతం అట్టుడుకుతోంది. చట్టానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి చట్టం దోహదపడుతుందని కొందరు వాదిస్తుండగా... రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పని అని కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మైనారిటీలకు రక్షణ లేకపోవడం, వారిని వేధింపులకు గురి చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చినవారికి ఆశ్రయమివ్వక తప్పదని ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. అయితే ప్రతివాదులు చెప్పేదీ విస్మరించదగ్గది కాదు.

Northeast India is in the throes of the latest Citizenship Amendment Act introduced by the NDA government.
అక్రమ వలసపై వక్ర రాజకీయం... అట్టుడుకుతున్న ఈశాన్య భారతం

తాజా పౌరసత్వ సవరణ చట్టం ఈశాన్య భారతంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అసోం, త్రిపుర, షిల్లాంగ్‌ ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. చట్టంపై రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయి. చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈ చట్టం దోహదపడుతుందని అనుకూలురు వాదిస్తుండగా; అసలు ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైందని, ప్రజల్ని మతపరంగా విభజించే కుట్రగా వ్యతిరేకులు అభివర్ణిస్తున్నారు.

1955నాటి పౌరసత్వ చట్టం ప్రకారం ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించేవారిని అక్రమ వలసదారులుగా సూత్రీకరించారు. వారికి పౌరసత్వం నిషేధించారు. అవిభక్త భారతావనికి చెందిన ప్రస్తుత పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్‌ల్లోని మైనారిటీలు అక్కడ వేధింపులకు గురై తలదాచుకోవడానికి భారత్‌కు వచ్చి ఉంటే వారిని అక్రమ వలసదారులుగా కాకుండా శరణార్థులుగా గుర్తించాలని తాజా చట్టం చెబుతోంది. వారు పౌరసత్వానికి అర్హులుగా పేర్కొంటోంది. ఆ మూడు దేశాలు ఇస్లాం రాజ్యాలు అయినందున అక్కడి నుంచి వచ్చిన మైనారిటీలు అంటే- హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు భారత పౌరులు కావచ్చు. కానీ, ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిములను మాత్రం అక్రమ వలసదారులుగానే పరిగణిస్తారు. వారు మత వేధింపులకు గురయ్యే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. వారు మెరుగైన జీవనం కోసమే భారత్‌కు వచ్చినందువల్ల పౌరసత్వానికి అనర్హులు. ఇదీ తాజా చట్ట సారాంశం.

దశాబ్దాల సమస్య...

స్వదేశంలో ఆశ్రయం కోల్పోయి వేరే దేశానికి వలస వచ్చినవారిని శరణార్థులంటారు. మెరుగైన జీవితం కోసం వేరే దేశానికి వచ్చినవారు అక్రమ వలసదారులు. 1947లో దేశ విభజన తరవాత దాదాపు కోటిన్నరమంది సరిహద్దులు దాటి అటూ ఇటూ మారారు. అందులో పశ్చిమ సరిహద్దులోనే సుమారు 1.12 కోట్ల మంది భారత్‌లో, పశ్చిమ పాకిస్థాన్‌లో శరణు పొందారు. తూర్పు సరిహద్దులో దాదాపు 42 లక్షల మంది మార్పిడి చెందారు. 1959 టిబెట్‌ తిరుగుబాటులో 80 వేలమంది భారత్‌కు వలస వచ్చినట్లు అంచనా. బౌద్ధ మతగురువైన 14వ దలైలామా సైతం శరణు పొందారు. 1972లో ఉగాండాలో వేధింపులకు గురైన భారతీయులు ఇక్కడ ఆశ్రయం పొందారు. శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో లక్షమందికి పైగా తమిళులు వలస వచ్చారు. వారు శరణార్థులు కావడంతో ఇబ్బంది లేదు. అక్రమ వలసదారులతోనే సమస్య ఏర్పడుతుంది.

బంగ్లా నుంచి వలసల ప్రవాహం...

దేశ విభజన సందర్భంగా పశ్చిమ సరిహద్దులో ప్రజలు ఎదుర్కొన్న బాధలు వర్ణనాతీతం. వలసలన్నీ దాదాపు మతపరంగానే జరిగాయి. పాకిస్థాన్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌లోకి; భారత్‌నుంచి ముస్లిములు పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. తూర్పు ప్రాంతంలో అలా జరగలేదు. ఆ తరవాత తూర్పు పాకిస్థాన్‌లో, బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ప్రజలు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చారు. ఆ వలసల ప్రవాహం ఇటీవల వరకూ కొనసాగుతూనే ఉంది.

హోం శాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం దాదాపు 2.40 కోట్ల అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ఎక్కువమంది వలసదారులు అసోమ్‌లో లేరు. అధికభాగం పశ్చిమ్‌ బంగలో ఉన్నారు. సుమారు 75 లక్షలమందికి పైగా ఆ రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఆ తరవాత స్థానం అసోం, త్రిపుర రాష్ట్రాలదే. దేశ రాజధాని ప్రాంతంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది స్థిరపడ్డారని అంచనా. ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, హైదరాబాద్‌లకూ చాలామంది వలస వచ్చారు.

తగ్గుతున్న అస్సామీలు...

అసోమ్‌లో వలసలకు వ్యతిరేకంగా మొదట్నుంచి ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. వలసలతో ముస్లిముల జనాభా పెరిగింది. ఒకప్పుడు 25 శాతమున్నవారు 35 శాతానికి చేరుకోవడంతో హిందువుల్లో ఆందోళన నెలకొంది. అస్సామీల జనాభా రానురాను తగ్గి ప్రస్తుతం ఆ భాష మాట్లాడేవారి సంఖ్య 50 శాతం కన్నా దిగువకు చేరింది. దీంతో తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రమాదం వచ్చిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా విద్యార్థి ఉద్యమం, కేంద్రంతో ఒప్పందం, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) తయారీ, 19 లక్షల మంది అక్రమ వలసదారులుగా గుర్తింపు... తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బంగాల్​లోనే అధికం...

పౌరపట్టిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అక్రమ వలసదారుల సంఖ్యను తక్కువగా చూపించారని అస్సామీలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ్‌ బంగలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కువమంది వలసదారులు రాష్ట్రంలో ఉన్నా, ఇటీవల భాజపా రాజకీయంగా పుంజుకొన్న దాకా ఆ సమస్యను పట్టించుకున్నవారు లేరు. మతపరంగా చూస్తే 1951లో 20 శాతంగా ఉన్న ముస్లిమ్‌ జనాభా 2011నాటికి 27 శాతానికి పైగా పెరగడానికి అక్రమ వలసలే కారణమని భాజపా చెబుతోంది. సీపీఐ(ఎం), తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ సమస్యను కప్పిపుచ్చాయని, అసోమ్‌లో మాదిరిగా ఎటువంటి ఆందోళన, ప్రచారం చేయకపోవడం వెనక కుట్ర దాగుందని ఆరోపిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అసోమ్‌లో అక్రమ వలసల వల్ల తమ అస్తిత్వం దెబ్బతిందని అస్సామీలు భావిస్తున్నారు. బెంగాల్‌ పరిస్థితి వేరు. బంగ్లాదేశ్‌, పశ్చిమ్‌ బంగల్లో ఒకే భాష, సంస్కృతి కలిగి ఉండటం వల్ల ప్రజల్లో అంతగా ఆందోళన లేదు. బెంగాలీల వలసల వల్ల త్రిపురలో 1951లో 60 శాతం ఉన్న ఆదివాసులు 2011 వచ్చేసరికి 31 శాతానికి పడిపోయి మైనారిటీలుగా మారిపోయారు. అందుకనే ఆదివాసుల అక్రమ వలసలపై వ్యతిరేకతతో ఉన్నారు.

ఈశాన్య ఎంపీలూ సమ్మతమే... కానీ..!

వివిధ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించిన తరవాతే హోం మంత్రి అమిత్‌ షా బిల్లు రూపొందించారు. అందువల్లే ఈశాన్య భారతానికి సంబంధించిన ఎక్కువమంది పార్లమెంటు సభ్యులు ఈ బిల్లును సమర్థించారు. ‘ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌’ ఉన్న ప్రాంతాలు, ఆరో షెడ్యూలులోని స్వయంపాలిత ప్రాంతాలు ఈ చట్టం పరిధిలోకి రావు. మొత్తం ఈశాన్య భారతంలో అసోం (మూడు స్వయంపాలిత ప్రాంతాలు మినహాయించి), త్రిపుర (ఆదివాసీ స్వయంపాలిత ప్రాంతం మినహాయించి), మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అందువల్లే ఆందోళన ఆ ప్రాంతాలకే పరిమితమైంది.

చిత్తశుద్ధి కరవు...

ఈశాన్య భారతంలో వలసలు ఎక్కువగా ఉన్నది అసోం, త్రిపురల్లోనే. త్రిపురలో క్రమేణా బెంగాలీలు మెజారిటీగా మారుతున్నారు. కాబట్టి అక్కడ ఆదివాసీ ఆందోళన పెద్దగా ప్రభావితం కాలేదు. మొదట్నుంచీ అసోం ఆందోళనా పథంలోనే సాగుతోంది. దాని పర్యవసానమే 1985నాటి అసోం ఒప్పందం. ఈ ఒప్పందం రూపుదిద్దుకుని 35 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సక్రమంగా అమలుకాకపోవడంతో అస్సామీయుల్లో అసంతృప్తి నెలకొంది.

చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) తయారైంది. వలసదారుల సంఖ్య 19 లక్షలేనని తేల్చడంపట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అందులోనూ దాదాపు అయిదు నుంచి ఆరు లక్షలుగా ఉన్న హిందువులకు ఈ చట్టం వల్ల- ఉన్నచోటే ఉండిపోవడానికి అర్హత లభించడంతో అస్సామీయుల ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో తమ సంస్కృతి, భాష, అస్తిత్వం దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతున్నారు. వారి అస్తిత్వాన్ని కాపాడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా ఆవేశం చల్లారలేదు.

నమ్మకం కలిగించాలి..

ఇదేదో భాజపాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన అనుకుంటే పొరపాటే! ఏ పార్టీపైనా అక్కడి ప్రజలకు సదభిప్రాయం లేదు. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, భాషలకు వచ్చిన ప్రమాదమేమీ లేదన్న నమ్మకం కలిగించే చర్యలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది.

పశ్చిమ్‌ బంగలో పరిస్థితి వేరు! వలసదారులందరికీ పౌరసత్వం కల్పించాలనేది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయం. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని తృణమూల్‌ ప్రభుత్వం చెబుతోంది. కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఆమె వైఖరికి సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రజాభీష్టం ప్రకారం నిర్ణయం తీసుకోవడం సహజమే. కానీ, జాతీయపార్టీల వైఖరి విచిత్రంగా ఉంది. ఇవి అసోమ్‌లో ఒక విధంగా పశ్చిమ్‌ బంగలో మరో విధంగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా అన్ని పార్టీలు సమస్యను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంతేతప్ప సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నది చేదు నిజం!

అంతా రాజ్యాంగబద్ధం...

దేశ విభజన అనంతరం 1950 ఏప్రిల్‌లో నెహ్రూ-లియాఖత్‌ అలీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మైనారిటీలకు రెండు దే శాల్లో పూర్తి రక్షణ కల్పించాలి. భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నందున మైనారిటీలు ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీలకు రక్షణ లేదు. అందువల్లే అక్కడి నుంచి మనదేశానికి వలస వస్తున్నారు. 1972లో ఇందిరాగాంధీ-షేక్‌ ముజిబూర్‌ రెహ్మాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అక్రమ వలసదారులను వెనక్కు తీసుకోవడానికి బంగ్లాదేశ్‌ అంగీకరించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మైనారిటీలకు రక్షణ లేకపోవడం, వారిని వేధింపులకు గురి చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చినవారికి ఆశ్రయమివ్వక తప్పదని ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. అయితే ప్రతివాదులు చెప్పేదీ విస్మరించదగ్గది కాదు. రాజ్యాంగం 14వ అధికరణ ప్రకారం మతపరమైన దుర్విచక్షణ చూపరాదు. ఈ చట్టం అలాంటి దుర్విచక్షణ చూపడం లేదని, వేధింపులకు గురైన అన్ని మతాలను కలిపి ఒక వర్గంగా మాత్రమే పరిగణిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది.

-కె. రామకోటేశ్వరరావు, రచయిత, సామాజిక విశ్లేషకులు

ABOUT THE AUTHOR

...view details