కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై పెద్దల సభలో వివరణ ఇచ్చిన విదేశాంగమంత్రి జైశంకర్, ప్రధాని కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భారత్, పాకిస్థాన్‌లు కోరితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ కశ్మీర్ విషయంలో సాయం చేయమని ట్రంప్‌ను ఏనాడూ కోరలేదు. ఈ విషయాన్ని సభకు స్పష్టం చేస్తున్నాను. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను భారత్ ఎప్పుడైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటుంది."-జైశంకర్, భారత విదేశాంగమంత్రి
సొంత మంత్రిని నమ్మరా
మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చినా విపక్షాలు సంతృప్తి చెందలేదు. ఈ పరిణామంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. విదేశీ నేత చెప్పిన మాటలను విశ్వసిస్తున్న మీరు (విపక్షాలు)... సొంత మంత్రి (జైశంకర్) మాటలను నమ్మలేరా అని వ్యాఖ్యానించారు.
మోదీ స్వయంగా చెప్పాల్సిందే