ఝార్ఖండ్‌లోని బొకారోకు చెందిన ప్రమోద్ కుమార్‌కు చిన్న నాటి నుంచి మొక్కలు పెంచే అలవాటు ఉంది. 16 ఏళ్ల వయసు నుంచి ఇంట్లోని పెరట్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడు. ఈ అలవాటే... ఇప్పుడతడికి జీవనాధారం అయింది.
అరుదైన మొక్క పేరుతో ప్రసిద్ధి
ఆఫ్రికా, అరేబియన్ దేశాల్లో అరుదుగా కనిపించే అడీనియం జాతి మొక్కలు ప్రమోద్ వద్ద అధిక సంఖ్యలో లభిస్తాయి. అందుకే ఈ మొక్క పేరుపై 'అడీనియం అడ్డా' అనే పేరు వచ్చింది ప్రమోద్ మొక్కల కేంద్రానికి.
మొదట్లో మొక్కల పెంపకం అభిరుచిగా ఉండేది. కాలానుగుణంగా దీనిపై ఆసక్తి పెరిగింది. ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేకమైన మొక్కల పెంపకంలో మెలకువలు నేర్చుకున్నాను. ప్రస్తుతం మొత్తం 300 జాతుల మొక్కల్ని పెంచుతున్నా. వాటిలో మూడు ప్రధానమైనవి.. అవి అడినియం,సుకలనైట్, కాకటస్ జాతులకు చెందినవి. పర్యావరణానికి ఉపయోగపడే సన్సివిరియా ట్రైఫాసియాటా మొక్కల్ని కేంద్రంలో పెంచుతున్నాను - ప్రమోద్ కుమార్
అడీనియంను ఎడారి గులాబీ అని పిలుస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే ఇవి మనుగడ సాగిస్తాయి. రంగురంగుల అందమైన పుష్పాలకు ఈ మొక్క ప్రసిద్ధి. డార్జిలింగ్, కాలిమ్పాంగ్, థాయ్‌లాండ్‌లు అడినియం మొక్కలకు ప్రసిద్ధి. అయితే ఝార్ఖండ్ బొకారోలోనూ ఎటువంటి వ్యాధులకు గురికాకుండా మొక్కలు పెరుగుతుండటం విశేషం.