సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయ సభల సెక్రటరీ జనరల్స్ బులెటిన్ విడుదల చేశారు. తొలిరోజులో భాగంగా రాజ్యసభ ఉదయం, లోక్‌సభ మధ్యాహ్నం సమావేశం కానుంది.
సెప్టెంబర్ 14 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లోక్‌సభ సమావేశాలు జరగనుండగా.. ఆ తర్వాతి రోజుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు లోక్‌సభ కార్యకలాపాలు ఉంటాయి.
ఇదే విధంగా తొలిరోజు(సెప్టెంబర్ 14) మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు రాజ్యసభ సమావేశాలు నిర్వహించనుండగా.. మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు నిర్వహిస్తారు. మొత్తం సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులిచ్చారు.
అయితే శూన్యగంట యథావిధిగా కొనసాగనుంది. ఉభయ సభలు నాలుగు గంటల చొప్పున భేటీ కానున్నాయి. సభా కార్యకలాపాలకు హాజరయ్యే ఎంపీలు కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు పార్లమెంట్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్డినెన్సులపైనే ప్రధానంగా..
వారాంతాల్లో కూడా సభా కార్యకలాపాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సమావేశాల్లో.. కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న 'వన్ నేషన్- వన్ మార్కెట్' సహా గత ఐదు నెలల్లో జారీ చేసిన 11 ఆర్డినెన్సులను ఆమోదించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి రోజు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ పదవికి జేడీయూ ఎంపీ హరివంశ్‌ను మళ్లీ ఎన్నికోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి-సుదూరంలోని గెలాక్సీని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు