రాహుల్ వ్యాఖ్యలకు దిల్లీ పోలీసుల క్లీన్ చిట్ ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. 2016 మార్చిలో మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని సిటీ కోర్టుకు తెలిపారు దిల్లీ పోలీసులు.
"ఫిర్యాదును పరిశీలిస్తే శిక్షార్హమైన నేరమేమీ కనిపించడంలేదు. ఒకవేళ రాహుల్ మోదీని కించపరిచేలా మాట్లాడారని భావిస్తే... పరువు నష్టం కేసు పెట్టాలి."
-దిల్లీ పోలీసుల నివేదిక
"మోదీ సైనికుల రక్తం చాటున దాక్కుంటారు. వాళ్ల త్యాగాన్ని సొంత లబ్ధి కోసం వాడుకుంటారు" అని 2016లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ మాటల్ని తప్పుబడుతూ జోగిందర్ తులా అనే న్యాయవాది దిల్లీ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదుచేసేలా పోలీసులకు సూచించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించగా... దిల్లీ పోలీసులు నేడు నివేదిక సమర్పించారు.
ఇదీ చూడండి: కమల్ 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై విచారణకు నిరాకరణ