కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఉగ్రవాద ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసులో మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేసిన ఎన్ఐఏ, నిందితుల బెయిల్ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు దావుద్‌తో లింకేంటి? - KERALA GOLD SCAM
మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు.. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). ఈ మేరకు ప్రత్యేక కోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేసింది.
కేసులో నిందితుడైన రమీజ్.. టాంజానియాలో వజ్రాల వ్యాపారం చేసేందుకుగానూ గోల్డ్ మైనింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ తెలిపింది. దావూద్ ఇబ్రహీం తన అనుచరుడి ద్వారా అక్కడే వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇందులో డీ గ్యాంగ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొంది.
బంగారం అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందని తెలిపింది ఎన్ఐఏ. ఈ కేసు దర్యాప్తు సాగాలంటే అదుపులోకి తీసుకున్న నిందితులందరికీ 180 రోజులపాటు కస్టడీ తప్పనిసరని స్పష్టం చేసింది.