పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడికి పాకిస్థాన్‌లో ఏ స్థాయి కుట్ర జరిగిందో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఛార్జిషీట్ కళ్లకు కట్టింది. ఈ తరహా కారు బాంబులు సిరియా, అఫ్గానిస్థాన్ వంటి రణ భూముల్లోనే వాడుతుంటారు. దీంతో నిందితులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. ఈ బృందం భారత్ వచ్చాక జైషే మహమ్మద్ టాప్ లీడర్‌షిప్ ప్రత్యేకంగా వీరితో 'టచ్'లో ఉంది. ఆపరేషన్ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని తేల్చింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ తన 13,800 పేజీల ఛార్జిషీట్‌లో ఫొటో, ఇతర ఆధారాలతో సహా పూసగుచ్చినట్లు పేర్కొంది.
పాకిస్థాన్‌లో పురుడు పోసుకున్న కుట్ర
కశ్మీర్‌లో కారు బాంబుతో భారీ ఉగ్రదాడి చేయాలని 2016-17లోనే జైషే మహమ్మద్ నిర్ణయించుకోగానే ఓ బృందాన్ని సిద్ధం చేసింది. మహమ్మద్ ఉమర్ అనే ఉగ్రవాదిని కారు బాంబుల తయారీలో నిపుణులు ఉన్న అఫ్గాన్‌కు పంపి శిక్షణ ఇప్పించింది. ఈ బృందాన్ని మెల్లిగా సాంబ-కథువా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న షకారఘ్రలోని ఉగ్రలాంచ్ ప్యాడ్స్‌కు చేర్చింది. అక్కడి నుంచి అదును చూసి ఉమర్‌తోపాటు మరో ముగ్గురు భారత్‌లోకి చొరబడ్డారు. వీరు ఐఈడీలతో భద్రతా దళాలపై దాడి చేయడానికి స్థానికులు సాయం చేశారు.
ఆ కారుతోనే దాడి..
ఉగ్రవాదులు భారత్‌లో ఉండటానికి.. వారిని ఘటనా ప్రదేశానికి తరలించడానికి నలుగురు సాయం చేశారు. ఈ క్రమంలో వీరిలో కొందరు ఉగ్రవాదులకు తమ ఇళ్లలోనే ఆశ్రయం ఇవ్వగా.. మరికొందరు శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారిపై దళాల కదలికలపై నిఘా వేసి సమాచారం సేకరించారు. షకీర్ బషీర్ తన ఇంట్లో ఆర్‌డీఎక్స్, జిలిటెన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను భద్రపర్చాడు.
2019 జనవరిలో సజ్జాద్ అహ్మద్ భట్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారుతోనే ఐఈడీ దాడి చేశారు. మిగిలిన వారు దాడి అనంతరం విడుదల చేయడానికి అవసరమైన ప్రచార వీడియోను చిత్రీకరించారు. దీనికి ఇన్షాజాన్ అనే వ్యక్తి ఇంటిని వాడుకొన్నారు.
ఐఈడీలతో..
ఫిబ్రవరి తొలివారంలో 160 కిలోలు, 40 కిలోల బరువున్న రెండు ఐఈడీలను సిద్ధం చేసుకొన్నారు. వీటికోసం పాక్ నుంచి వివిధ రూపాల్లో తరలించిన సామగ్రిని వాడుకొన్నారు. ఆ తర్వాత సజ్జాద్ కొనుగోలు చేసిన కారులో వీటిని అమర్చారు.