పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది బంధుమిత్రులను క్వారంటైన్‌కు తరలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం జరిగింది. వధువు బంధువుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా వారిని ప్రభుత్వ నిర్బంధ కేంద్రాలకు తరలించామని జిల్లా అధికారి వెల్లడించారు.
సీఐఎస్‌ఎఫ్ విధుల్లో..
వధువు బంధువు ఒకరు సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతవారం ఆయన ఛింద్వాడా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమతించారు.
ఇతర బంధువులను కలిసి..
ఇంటికి వచ్చాక అతను ఇతర ప్రాంతాల్లోని కొందరు బంధువులను కలిశారు. అలాగే మే 26న ఛింద్వాడాలో జరిగిన తన మరదలి పెళ్లికి హాజరయ్యారు. అయితే, కొద్దిరోజులుగా అతనిలో కరోనా లక్షణాలు కనిపించగా పరీక్షలు చేశామని, వైరస్ సోకినట్లు మంగళవారం నిర్ధరణ అయిందని కలెక్టర్ సౌరభ్ సుమన్ స్పష్టంచేశారు.
చర్యలు తీసుకుంటాం!
అతను కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నామని తెలిపారు. అతను కలిసిన వారు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నామన్నారు. ఆ వ్యక్తి తన మరదలి పెళ్లికి హాజరుకాగా.. నూతన వధూవరులతో సహా మొత్తం కుటుంబసభ్యులను, పెళ్లికి హాజరైన వారిని మూడు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. తర్వాత అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
ఇదీ చూడండి:మాజీ సీఎంకు మళ్లీ గుండెపోటు.. అత్యంత విషమంగా ఆరోగ్యం