ముమ్మారు తలాక్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు, దిల్లీ హై కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 'ముస్లిం మహిళా(వివాహ సంరక్షణ హక్కు) చట్టం 2019' ముస్లిం భర్తల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉందని ఈ రెండు పిటిషన్లు పేర్కొన్నాయి.
చట్టంలోని నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళకు చెందిన ఓ ముస్లిం సంఘం అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. కొత్త చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్షపడుతుంది. ఇలా జరిగితే... భార్య, భర్తలు మనసు మార్చుకునేందుకు వీలుండదని పిటిషనర్ పేర్కొన్నారు.
ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ఓ న్యాయవాది దిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టే అవకాశముందని సమాచారం.