తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవసరాలే ఆవిష్కరణలకు ఆలంబన: జస్టిస్ రమణ

కొత్త ఆవిష్కరణలకు అవసరాలే దారి చూపిస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కరోనా విషయంలోనూ ఇదే వర్తిస్తుందన్నారు. సుదూరంలో ఉన్న వారికోసం ఈ-కోర్టులు తీసుకురావాలని ఎన్నాళ్లగానో జరుగుతున్న ప్రయత్నాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ఇప్పుడు సుదూరంలో ఉన్నవారికీ న్యాయం చేయగలిగే స్థాయికి న్యాయవ్యవస్థ చేరిందని పేర్కొన్నారు.

NV RAMANA
జస్టిస్ రమణ

By

Published : Sep 20, 2020, 6:17 AM IST

అవసరమే ఆవిష్కరణలకు ఆలంబన అన్న నానుడి ప్రస్తుత కొవిడ్‌ మహమ్మారి కాలంలో వాస్తవ రూపం దాలుస్తోందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. సుదూరంలో ఉన్న వారికోసం ఈ-కోర్టులు తీసుకురావాలని ఎన్నాళ్లగానో జరుగుతున్న ప్రయత్నాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ఇప్పుడు సుదూరంలో ఉన్నవారికీ న్యాయం చేయగలిగే స్థాయికి న్యాయవ్యవస్థ చేరిందని పేర్కొన్నారు.

కర్ణాటక రాష్ట్ర న్యాయసేవల సంస్థ, హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బెంగళూరులో మొదలైన మెగా ఈ-లోక్‌అదాలత్‌ను ఆయన దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. కొవిడ్‌ మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మార్పులను స్వీకరించిందని, ఇప్పుడు కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ-లోక్‌అదాలత్‌ వ్యవస్థ. రూపాంతరీకరణకు అద్దం పడుతోందని చెప్పారు.

సాంకేతిక విధానాలతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం

"కొవిడ్‌ మహమ్మారి ఎన్నో అడ్డంకులను సృష్టించింది. ప్రజారోగ్య మార్గదర్శకాలకు లోబడి సరికొత్త సాంకేతిక పరిష్కార మార్గాలను అనుసరించాల్సిన విధిలేని పరిస్థితులను వ్యవస్థలకు కల్పించింది. సాంకేతికతను అందిపుచ్చుకొని సుదూర ప్రాంతంలోని వారికీ న్యాయాన్ని అందించే పరిస్థితి తీసుకువచ్చింది. అవసరమే ఆవిష్కరణలకు ఆలంబన అన్నది నానుడి. అది మన విషయంలో నిజమైంది.

ఈ మహమ్మారిని అధిగమించడానికి మనం అనుసరించిన సాంకేతిక విధానాలు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు చూపుతాయి. దుర్బల వర్గాలకు న్యాయాన్ని అందుబాటులోకి తీసురావడం గురించి, వీడియో కాన్ఫరెన్స్‌, వీడియో కోర్టులు, ఈ-కోర్టుల అమలు కోసం ఎన్నోరోజుల నుంచి చర్చిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అంతిమంగా అది కార్యాచరణలోకి వచ్చింది. న్యాయసేవా వ్యవస్థలకు దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. అందువల్లే సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో చక్కగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో గుర్తించదగ్గ స్థాయిలో మార్పునకు బీజం వేశాయి."

- జస్టిస్ ఎన్​వీ రమణ

ప్రచారంతో ప్రజాభిమానం పొందేలా చేయాలి

లక్షలాది మందికి వివాదాలను పరిష్కరించుకొనే వేదికను కల్పించడం ద్వారా ఈ-లోక్‌అదాలత్‌ భారతీయ న్యాయవ్యవస్థ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చే స్థాయికి చేరిందన్నారు జస్టిస్ రమణ. వివాద ప్రక్రియలో ఉన్న విభిన్న ఇబ్బందుల కారణంగా దేశంలో చాలామంది కక్షిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి తటపటాయిస్తూ వచ్చారని తెలిపారు.

"ఇప్పుడు మొదలుపెట్టిన ఈ-వివాద పరిష్కార విధానంవల్ల కక్షిదారులకు ఖర్చుతోపాటు, సమయం కలిసి వస్తుంది. ఉన్న చోటనుంచే ఈ-లోక్‌అదాలత్‌లలో పాలుపంచుకోవచ్చు. న్యాయస్థానాలపై పెరిగిపోతున్న కేసుల భారాన్ని ఈ వ్యవస్థ తగ్గించగలుగుతుంది. వీటికి విస్తృత ప్రచారం కల్పించి ప్రజాభిమానం చూరగొనేలా చేయడమే కీలకం. ఇవి సరళంగా పనిచేస్తూ ఎక్కువమందికి అందుబాటులోకి రావాలి. 60% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నందున వారికి వీడియో కాన్ఫరెన్స్‌ లభ్యమయ్యేలా మౌలిక వసతులను బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరూ వివాదాలను పరిష్కరించుకోవాలన్న మనస్తత్వంతో ఆలోచించాలి. అప్పుడే ఈ-లోక్‌అదాలత్‌ విధానం విజయవంతం అవుతుంది" అని తెలిపారు.

"వివాదాలను నిరుత్సాహపరచండి. మీకు సాధ్యమైనంతవరకూ రాజీపడటానికి పొరుగువారిని ఒప్పించండి. రాజీ కుదర్చడం ద్వారానే మంచి మనిషిగా నిలిచే గొప్ప అవకాశం లాయర్‌కు లభిస్తుంది. మిగతా వ్యవహారాలకూ తగినంత చోటు ఉంటుంది’ అన్న అబ్రహాం లింకన్‌ మాటలను అందరూ గుర్తుంచుకోవాలి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ-లోక్‌అదాలత్‌ విజయవంతమైతే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కక్షిదారులు, యువ న్యాయవాదులిద్దరికీ ఈ కొత్త వ్యవస్థ మేలు చేస్తుంది. ప్రాథమిక స్థాయిలోనే వివాదాలు పరిష్కారమై న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. వ్యవస్థ ప్రభావశీలంగా పనిచేయాలంటే ప్రతి రాష్ట్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి’’

- జస్టిస్‌ ఎన్​వీ రమణ

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మిలటరీ క్యాంటీన్​లో 'మేడ్​ ఇన్​​ ఇండియా' అమలవుతోందా..?

ABOUT THE AUTHOR

...view details