కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్డౌన్ గడువు త్వరలో తీరిపోనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే వైరస్‌పై పోరులో ముందుకు సాగాలని ఉద్ఘాటించారు. లాక్డౌన్ విధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. లాక్డౌన్ ఫలితాలు రాబోయే నెలల్లో కనిపిస్తాయని వెల్లడించారు. రాష్ట్రాలు ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు మోదీ.
'కొనసాగింపునకే సీఎంల మొగ్గు'
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ విశేషాలను వెల్లడించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. లాక్డౌన్ కొనసాగింపునకే మెజార్టీ ముఖ్యమంత్రులు మొగ్గు చూపారని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలకు స్వల్పంగా అనుమతించాలని సీఎంలు మోదీకి విన్నవించినట్లు వివరించారు. అయితే ముఖ్యమంత్రుల వినతిపై ప్రధాని ఏ విధమైన వ్యాఖ్య చేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎంలు, ఆరోగ్య శాఖ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.