శ్రీనగర్ సరిహద్దు సహా నగరంలో దాదాపు 24 మంది ఉగ్రవాదులు బహిరంగంగానే స్థానికులను బెదిరిస్తూ.. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగాడుతున్నారని తెలిపారు.
బంద్ పాటించేలా ఒత్తిడి..
భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండే రాజ్‌బాగ్, జవ్‌హార్ నగర్, లాల్‌చౌక్‌లలోని దుకాణ యజమానులపై తుపాకులు గురిపెట్టి పూర్తిగా బంద్ పాటించేలా ఒత్తిడి తీసుకువస్తున్నారని అధికారులు వెల్లడించారు. దుకాణాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను బంద్ చేసేలా బెదిరిస్తున్నారని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు అంచార్ సరస్సు సరిహద్దు ప్రాంతాలను సైతం ఉగ్రవాదులు దిగ్బంధించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం వారి కదలికలు గుర్తిస్తున్నామన్నారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ డిల్బగ్ సింగ్ అన్నారు. అయితే ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారనడం సరికాదన్నారు.