ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వ్యాక్సిన్ ఇంకా వెలువడలేదు. కానీ, ఈ ప్రమాదకరమైన వైరస్ను ఉన్నచోటే కదలనీయకుండా చేసి.. వ్యాప్తిని తగ్గించే సాంకేతికతను కనుగొన్నారు కర్ణాటక పరిశోధకులు. కొవిడ్-19కు చెక్ పెట్టే సరికొత్త 'నానో ప్లాస్టిక్ షీట్లు' తయారు చేశారు.
మంగళూరు, శిమొగ్గ పట్టణం మాచెనహల్లి పారిశ్రామిక ప్రాంతంలోని బాలాజీ పాలీప్యాక్ యాడ్-నానో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. కరోనాను అంతం చేసేందుకు నానో టెక్నాలజీని వినియోగించింది. సంస్థలోని పరిశోధకులు వినయ్ ఆయన బృందంతో కలిసి తొలుత ఈ అంశంపై పరిశోధన ప్రారంభించారు.
కరోనా వైరస్ ప్లాస్టిక్ మీద 3 రోజుల వరకు సజీవంగా ఉంటుంది. చెక్క, అద్దంపై నాలుగు రోజులు, ఇతర లోహాలపై 5 రోజుల వరకు సజీవంగా ఉంటుంది. కానీ, నానో సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఈ షీటు మీద.. కరోనా వైరస్ కదలకుండా ఉన్నచోటే అతుక్కుపోతుంది. కాబట్టి ఈ షీటుపై కేవలం 2 గంటల 54 నిమిషాల్లోనే వైరస్ అంతం అవుతుంది.