తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గురుద్వారా' ఘటనపై పార్టీలకతీతంగా నిరసనలు - Nankana Sahib incident justifies CAA: BJP

పాకిస్థాన్​ లాహోర్​లో గురుద్వారాపై జరిగిన దాడి నేపథ్యంలో భారత్​లో పార్టీలకతీతంగా నేతలు ఐక్యతా గళం వినిపించారు. మైనారిటీలపై పాక్ తీరును తప్పుపట్టారు. దిల్లీలోని పాక్ దౌత్యకార్యాలయం ఎదుట పలు పార్టీల నేతలు, సిక్కు సంస్థలు నిరసనకు దిగాయి. జమ్ము కశ్మీర్​లోనూ నిరసనలు జరిగాయి.

gurudwar
'గురుద్వారా' ఘటనపై పార్టీలకతీతంగా నిరసనలు

By

Published : Jan 5, 2020, 5:03 AM IST

Updated : Jan 5, 2020, 11:17 AM IST

'గురుద్వారా' ఘటనపై పార్టీలకతీతంగా నిరసనలు

పాకిస్థాన్​ లాహోర్​లోని నన్​కానా సాహిబ్​ గురుద్వారా దాడి ఘటనపై భారత్​కు చెందిన నేతలు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. పంజాబ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని దిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పాక్​లోని సిక్కు గురుద్వారాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది కుట్రపూరితంగా చేపట్టిన దాడి అని ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​​, దిల్లీ సిక్కు పర్బంధక్ కమిటీ నేతలు ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు.

అయితే పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి చేరుకోకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. అనంతరం పలువురు సిక్కు ప్రతినిధులు.. డీఎస్​జీఎంసీ నేత మన్​జిందర్ ఎస్​ సిర్సా నేతృత్వంలో పాక్ దౌత్యాధికారులను కలిసి గురుద్వారా ఘటనపై మెమొరాండాన్ని సమర్పించారు.

పాక్​కు విచారణ కమిటీ

భారత్​లోని సిక్కు ఆధ్యాత్మిక క్షేత్రాలను పరిరక్షించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(ఎస్​జీపీసీ) ఇప్పటికే ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వీరిని పాక్​కు పంపి విచారణ చేయాల్సిందిగా నిర్దేశించింది. కమిటీ సభ్యుల ద్వారా గురుద్వారాపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పాక్​ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు స్పష్టం చేసింది.

'పాక్ అసలు రంగు బయటకు'

ఇలాంటి దాడులను ఏమాత్రం సహించేది లేదని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. సిక్కులపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు పాక్​పై ఒత్తిడి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. మైనారిటీలపై చేస్తున్న దాడులతో పాక్ అసలు రంగు బయట పడిందని కేంద్రమంత్రి హర్​సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు.

'పౌరచట్టం అవసరాన్ని నొక్కి చెప్పింది'

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం(పౌరసత్వ చట్ట సవరణ) సరైనదేనని పాక్​లో గురుద్వారాపై దాడి నిరూపిస్తోందని భాజపా, విశ్వహిందూ పరిషత్ విభాగం నేతలు పేర్కొన్నారు.

పాకిస్థాన్​లోని మైనారిటీలు దశాబ్దాలుగా మత మార్పిడులు, అత్యాచారాలు, హింసకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు భాజపా నేత మీనాక్షి లేఖి. గురుద్వారా ఘటనతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా వామపక్ష నేతలు కళ్లు తెరవాలని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్​లో నిరసనలు

గురుద్వారా ఘటనను నిరసిస్తూ పలు సిక్కు సంస్థలు, శివసేన డోగ్రా ఫ్రంట్ నేతలు జమ్ములో నిరసనలు చేపట్టారు. పూంచ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. ఘటనకు కారణమైన నేరస్తులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది..?

పోలీసుల వివరాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబరులో హసన్ అనే యువకుడు సిక్కు వర్గానికి చెందిన ఓ అమ్మాయిని అపహరించి వివాహం చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా మతమార్పిడి చేయించాడు. దీంతో బలవంతపు మతమార్పిడుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హసన్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హసన్ కుటుంబ సభ్యులు కొంతమంది మద్దతుతో గురుద్వారాకు సమీపంలో నిరసనకు దిగారు. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ఇదీ చూడండి: గురుద్వారాపై దాడిని ఖండించిన ఎస్​జీపీసీ.. కమిటీ ఏర్పాటు

Last Updated : Jan 5, 2020, 11:17 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details