కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా మధ్య జరిగిన సమావేశంలో.. ఈ అంశం చర్చకు వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
ఈసారి ఆన్లైన్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!
కరోనా సంక్షోభం దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అవకాశముంది. ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
సాధారణ విధానంలో సమావేశాలను నిర్వహించే పరిస్థితులు లేనందున.. సాంకేతికతను ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. పార్లమెంటరీ కమిటీల సమావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అంశాన్ని.. ఇరు సభలకు చెందిన రూల్స్ కమిటీకి నివేదించాలని వెంకయ్య, ఓం బిర్లా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ సమావేశాలను పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో.. రాజ్యసభను లోక్‌సభ ఛాంబర్‌లో నిర్వహించాలన్న అంశంపైనా చర్చలు సాగినట్లు సమాచారం. ఇరు సభలను ఒకే రోజు కాకుండా రోజు విడిచి రోజు నిర్వహించాలని భావిస్తున్నారు. వ్యక్తిగత దూరం పాటించేలా సెంట్రల్ హాల్ వినియోగంపై అవకాశాలను పరిశీలించాలని ఉభయ సభల కార్యదర్శులను ఆదేశించారు.