మహా కార్చిచ్చు ఏదో పెచ్చరిల్లినట్లు, భయానక కాలనాగు కసిగా గరళం చిమ్ముతున్నట్లు- కేసులు, ప్రాణనష్టం తీవ్రతల రూపేణా కరోనా వైరస్ ఉద్ధృతి ప్రపంచ దేశాల్ని కలవరపరుస్తోంది. సంక్షోభ కేంద్రమైన చైనా, హుబెయ్ ప్రావిన్సులో రెండు రోజుల వ్యవధిలోనే బలైన 130మంది సహా కరోనా మూలాన మరణాల సంఖ్య అయిదు వందలకు చేరువైంది.
26 దేశాలకు..
చైనాలోనే దాదాపు పాతికవేల మందికి సోకినట్లు నిర్ధారించిన మహమ్మారి వైరస్ బాధిత జాబితాలో ఇప్పటికే భారత్ సహా 26 దేశాల పేర్లు చేరాయి. ఫిలిప్పీన్స్, హాంకాంగుల్లోనూ మరణాలు నమోదయ్యాయి. ఈ దశలో దీన్ని 'విశ్వవ్యాప్త సాంక్రామిక వ్యాధి'గా పరిగణించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా- మాయదారి వైరస్ విధ్వంసక సామర్థ్యాన్ని బట్టి నేడు ఏ దేశమూ ఉదాసీనంగా ఉండే వీల్లేదు.
ఇదీ యుద్ధమే!
పాములు, గబ్బిలాలనుంచి మనుషులకు సంక్రమించిందంటున్న వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో గడ్డు సవాలు ఎదుర్కొంటున్నామన్న చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్ బహిరంగ ఒప్పుకోలు- అక్కడి సంక్షుభిత వాతావరణాన్ని కళ్లకు కడుతోంది. పది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించి విస్తృత వైద్య సేవలందిస్తూ, 13 నగరాల్లో సుమారు నాలుగు కోట్లమందికి పైగా ప్రజల కదలికల్ని నియంత్రిస్తూ చైనా నేడు అక్షరాలా యుద్ధమే చేస్తోంది! వుహాన్ నగరంలో చిక్కుబడిన తమ పౌరుల్ని ప్రత్యేక విమానాల్లో వెనక్కి రప్పించిన భారత్ వంటి దేశాలు వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అటువంటి వసతులు తమవద్ద లేవని పాకిస్థాన్ చేతులెత్తేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు, అన్ని దేశాలూ చేతులు కలిపి చురుగ్గా పనిచేస్తేనే వైరస్ విజృంభణను కట్టడి చేయడం సుసాధ్యమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గట్టిదెబ్బ తీయగలదంటున్న 'ఆత్యయిక పరిస్థితి'ని ఎదుర్కోగల వ్యవస్థాగత సన్నద్ధత ప్రపంచ దేశాల్లో ఏపాటి అన్నదే చిక్కుప్రశ్న.
అప్పటి సార్స్..
పద్దెనిమిదేళ్ల క్రితం చైనాలోనే తొలుత వెలుగు చూసిన సార్స్ (అత్యంత తీవ్ర శ్వాస కోశ సమస్య) మహోత్పాతాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం స్ఫురణకు తెస్తోంది. అప్పట్లో స్వీయ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వెరపుతో అతి గోప్యంగా వ్యవహరించిన బీజింగ్, ఈసారి జీవాయుధ ప్రయోగయత్నం వికటించి ప్రపంచానికే పెను ప్రమాదం వాటిల్లజేసిందన్న కథనాలు దిగ్భ్రాంతపరచాయి. సమస్య మూలం నికరంగా ఏమిటన్నది ఎప్పటికైనా నిగ్గు తేలుతుందో లేదో!
వ్యాధులు.. మరణాలు..
ఆనాడు కెనడా, వియత్నాం, సింగపూర్ వంటివి సమర్థ వ్యూహంతో మరణాలు తగ్గించడంలో సఫలమయ్యాయి. ఇప్పుడు చైనా ఏ ఒక్క అవకాశాన్నీ ఉపేక్షించకుండా కరోనా నియంత్రణను లక్షిస్తోంది. అప్పట్లో ప్రపంచం నలుమూలలా సార్స్ బాధితులు రమారమి ఎనిమిది వేల మందిలో మృతుల సంఖ్య ఇంచుమించు ఎనిమిది వందలు. 2009లో రెండున్నర లక్షలకు పైబడిన స్వైన్ ఫ్లూ కేసులలో మరణాలు దాదాపు మూడు వేలు. ఒక్క 2014లోనే ఎబోలా వైరస్ పాలబడి ఏడువేలమంది దాకా ప్రాణాలు కోల్పోయారు.