తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాథమిక చికిత్స కొరత- గ్రామాలను కాటేస్తున్న కాలనాగు..

ప్రపంచవ్యాప్తంగా విషనాగుల బారిన పడి ఏటా లక్షల మంది మరణిస్తున్న దేశాల్లో భారత్​ కూడా ఒకటి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. సుమారు 70 శాతం జనవాళికి అవసరమైన గ్రామసీమల్లో వైద్యసేవల దుర్బలత్వం ఇచ్చే బోధపడుతోంది. ఇందుకు తక్షణ నివారణ చర్యలు అనివార్యం.

By

Published : Feb 18, 2020, 7:20 AM IST

Updated : Mar 1, 2020, 4:43 PM IST

most of the snake bite deceases are appeared in villages.. there must need a special health care units said experts
గ్రామాలను కాటేస్తున్న కాలనాగు.. ప్రాథమిక చికిత్స కొరత

నివారించదగ్గ వ్యాధులూ విషనాగులై కోరసాచి నిలువునా ప్రాణాలు తోడేస్తున్న దురవస్థ దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న దేశం మనది. అలా ఏటా 24 లక్షలమంది మృత్యువాత పడుతున్న దైన్యంతో మొత్తం 136 దేశాల జాబితాలో ఇండియా కడగొట్టు స్థానంలో కునారిల్లుతోందని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. దురదృష్టం ఏమిటంటే- వైద్యసేవలకు నోచక 2016లో ఎనిమిది లక్షల 38 వేల మంది కనుమూయగా, సరైన వైద్యం లభించక మరణించినవారి సంఖ్య దాదాపు రెట్టింపుగా నమోదైంది. వైద్యసేవల్లో ప్రమాణాలు కొరవడి ప్రతి లక్ష జనాభాకు ఏటా బ్రెజిల్‌లో 74, రష్యాలో 91, చైనాలో 46, దక్షిణాఫ్రికాలో 93 మంది అసువులు బాస్తుంటే- ఆ సంఖ్య ఇండియాలో ఎకాయెకి 122గా లెక్కతేలుతోంది. బ్రిక్స్‌ దేశాలతోనే కాదు, ఇరుగు పొరుగులతో సరిపోల్చినా భ్రష్ట రికార్డు భారత్‌దే అంటున్న అధ్యయనాలను బట్టి- 70 శాతం జనావళికి ఆవాసమైన గ్రామసీమల్లో వైద్యసేవల దుర్బలత్వం ఇట్టే బోధపడుతుంది. సకాలంలో చికిత్స చేస్తే ప్రాణాంతకం కాని 32 రకాల వ్యాధులు, గాయాలు గ్రామాల్లో శోకాగ్నుల్ని ఎగదోస్తున్న దురవస్థను దునుమాడేందుకు జాతీయ వైద్య సంఘం (ఎన్‌ఎమ్‌సీ) చట్టాన్ని పట్టాలకెక్కించిన కేంద్రం- దాని అమలు కార్యాచరణకు సమకట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలే క్షేత్రస్థాయి వైద్యసేవలకు కీలకమైనందున- స్టాఫ్‌ నర్సులే సామాజిక ఆరోగ్య అధికారులుగా అక్కడ కొత్త పాత్ర పోషించనున్నారు. 2020-’21లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసుకునేవారిని సామాజిక ఆరోగ్య అధికారులుగా నియమించనున్న నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ తాజాగా కీలక నిర్ణయాల్ని ప్రకటించింది. ప్రస్తుతమున్న జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎమ్‌) పాఠశాలల్ని బీఎస్సీ కళాశాలలుగా ఉన్నతీకరించాలని, ఆ క్రమంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు నిర్వహణకు తగ్గట్లుగా బోధన సిబ్బంది, మౌలిక వసతుల్లో లోటుపాట్లున్నా సర్దుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తరహా సర్దుబాట్లే వైద్య ప్రమాణాలకు గోరీ కడుతున్నాయని చెప్పక తప్పదు.

ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి?

ప్రాథమిక ఆరోగ్య సేవల కోసమే దాదాపు 72శాతం మొత్తాన్ని ప్రజలు సొంతంగా భరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. డాక్టర్‌కు చూపించుకు రావాలన్నా (75శాతం), ఆసుపత్రిలో చేరాలన్నా (62శాతం) ప్రైవేటు వైద్యాలయాలే దిక్కు అయిన దేశంలో, సర్కారీ ఆరోగ్య సేవలు అక్షరాలా పడకేశాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పరిపుష్టీకరించాల్సిన అవసరాన్ని ఏనాడో 1946లో భోర్‌ కమిటీ గట్టిగా నొక్కి వక్కాణించగా, అందరికీ ఆరోగ్యం అన్న 1978 నాటి ఆల్మాఆటా ప్రకటనకు ఇండియా కట్టుబాటు చాటింది. దరిమిలా 1983, 2002 సంవత్సరాల్లో వెలుగు చూసిన జాతీయ ఆరోగ్య విధాన ప్రకటనలు పెద్దగా ఉద్ధరించిందేమీ లేదు. సార్వత్రిక ఆరోగ్య పరికల్పన లక్ష్యంగా వైద్యశాఖ బడ్జెట్‌ కేటాయింపుల్లో 70శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే మళ్లించాలని పన్నెండో పంచవర్ష ప్రణాళికా సూచించింది. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం- సమగ్ర ఆరోగ్య కులాసా కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని విస్తృతీకరించాలని నిర్దేశించింది. ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని లక్షన్నర ఆరోగ్య కులాసా కేంద్రాలుగా ఉన్నతీకరించాలని మోదీ ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో సంకల్పం ప్రకటించింది. నిరుడీ రోజుల నాటికి అలా కులాసా కేంద్రాలుగా రూపాంతరీకరణ జరిగినవి ఎనిమిది వేలే! సమున్నత లక్ష్య సాధనకు సమర్థ మానవ వనరుల కొరత అవరోధంగా మారుతుండబట్టే- గత్యంతరం లేని స్థితిలో తాత్కాలిక ప్రాతిపదికన ఆరోగ్య కేంద్రాల బాధ్యులుగా నర్సులకు కొంత శిక్షణ ఇచ్చి తీసుకోవాల్సి రావడాన్ని అర్థం చేసుకోవాల్సిందే. అలా ఇచ్చే ప్రాథమిక వైద్య శిక్షణలోనూ రాజీపడటం- మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉంది!

ఎకాయెకి 20 లక్షల మంది వైద్యులు, 40 లక్షల మంది నర్సులకు కొరత- ఆరోగ్య భారతావని లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. చాలీచాలని వైద్య సిబ్బందిలోనూ నగరాలు, పల్లెల నడుమ నిష్పత్తి 3.8:1గా ఉండటం- గ్రామీణ భారతాన్ని అక్షరాలా కోమాలోకి నెట్టేస్తోంది. అల్లోపతి ‘వైద్యసేవలు’ అందిస్తున్నవారిలో 57.3 శాతానికి ఎలాంటి ప్రామాణిక అర్హతలు లేవని కేంద్ర సర్కారే అంగీకరించే స్థాయిలో పొటమరించిన అవ్యవస్థ ఘన సంకల్ప ప్రకటనలతోనో, సమూల క్షాళనను లక్షించే చట్టాలు చేయడంతోనో మలిగిపోదు. 1990-2016 నడిమి కాలంలో సాంక్రామిక, ప్రసవ సమయ, ప్రసవానంతర, పౌష్టికాహార సంబంధ వ్యాధుల కారణంగా మరణాల రేటు 53.6 నుంచి 27.5 శాతానికి దిగివచ్చింది. మధుమేహం, క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సంబంధ సాంక్రామికేతర వ్యాధుల వల్ల మరణాల రేటు 37.9 నుంచి 61.8 శాతానికి పెరిగింది! ఊరికి వైద్యం అందించే క్రమంలో కాలానుగుణంగా కొత్త కోరలతో విరుచుకుపడుతున్న తీవ్ర జబ్బుల ఉనికిని గుర్తించడమే కాదు, వాటిని సమగ్రంగా కాచుకొనేలా నిష్ణాతులైన వైద్యుల్నీ తయారు చేసుకోవాలి. నర్సులకు ప్రత్యేక శిక్షణ ద్వారా వారిని సామాజిక ఆరోగ్య అధికారులుగా నియమించాలనుకుంటున్న కేంద్రం- లోగడ థాయ్‌లాండ్‌, యూకే, చైనాలతోపాటు న్యూయార్క్‌లోనూ ఆ తరహా ప్రయోగాలు సఫలమయ్యాయని ప్రకటించింది. దేశంలో గత మార్చినాటికి లక్షా 60 వేలకు పైగా ఆరోగ్య ఉపకేంద్రాలు, 30 వేల పైచిలుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5685 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో వైద్యులు, నర్సులు, ఉపకరణాలు, మందులు- ఇలా అన్నింటికీ కొరత వెన్నాడుతున్న దురవస్థను చెదరగొట్టాలంటే తక్షణ, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానపట్టి తీరాలి!

Last Updated : Mar 1, 2020, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details