తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనువాద సాహిత్యంతో మరింత సాన్నిహిత్యం - అనువాద సాహిత్యంతో మరింత సాన్నిహిత్యం

మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని రాజరాజనరేంద్రుడు నన్నయను అడగలేదు. వ్యాసహృదయాన్ని తెలుగులోకి ఆవిష్కరించమని కోరాడు. ఇక్కడ రచన అన్నారేగాని అనువాదం అనలేదు. తిక్కన తీరూ ఇదే. ఇలా ఆదికావ్యమే అనువాదానికి మూలమైంది. భారత భాగవతాలు రెండూ తెలుగు భాషకు జవసత్వాలను అందించాయి. జాతి సంస్కృతి ముంగిట ధ్వజస్తంభాలుగా నిలిచాయి.

అనువాద సాహిత్యంతో మరింత సాన్నిహిత్యం

By

Published : Nov 24, 2019, 8:58 AM IST

నన్నయభట్టును పిలిపించి రాజరాజ నరేంద్రుడు అడిగింది- వ్యాసభారతాన్ని తెలుగులోకి అనువదించమని కాదు. మహాభారతానికి మొదటిపేరు 'జయం'. దానిలో వ్యాసమహర్షి ధర్మస్వరూపాన్ని పరమాద్భుతంగా నిర్వచించారు, నిరూపించారు. 'దాన్ని నీ ధీశక్తితో తేటతెల్లం చేస్తూ వ్యాసహృదయాన్ని ఆవిష్కరించాలి' అని రాజరాజు కోరాడు. 'మహాభారత బద్ధ నిరూపితార్థము ఏర్పడ తెనుగున రచియింపుము' అన్నాడు. దాని ప్రకారమే 'తెనుంగునన్‌ మహాభారత సంహితారచన బంధురుడనయ్యాను' అని ఈయనా చెప్పుకొన్నాడు. ఇద్దరూ రచన అన్నారేగాని అనువాదం అనలేదు. ఆ రెండూ ఒకటి కాదు. తిక్కనదీ అదే దారి. 'అమ్మహాకావ్యంబును అర్థంబు సంగతంబు చేసెదను' అనేది సోమయాజి నిర్ణయం. ఫలితంగా కవిత్రయభారతం మూలానికి విధేయంగా ఉంటూనే సరికొత్త అల్లికను, నడకను, వినూత్న రుచులను తనలో పొదువుకొంది. ఆదికావ్యమే ఇలా అనువాదాలకు ఒక నమూనా కావడం తెలుగువారి అదృష్టం. యువభారతివారి 'వికాసలహరి'లో ఆచార్య దివాకర్ల 'వ్యాసునిది ప్రధానముగా పౌరాణిక నైతిక దృష్టి... దానిపట్ల వైముఖ్యము లేకున్నను, కవిత్రయమువారికి కావ్య కళాదృష్టి పుష్కలము' అని తేల్చారు. తెలుగువారి పంట పండి వ్యాసభాగవతం పోతన చేతికి దక్కింది. 'ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్‌ పురాణావళుల్‌ తెనుగుం చేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో... భాగవతాన్ని మాత్రం నాకు విడిచిపెట్టారు' అని పోతన పొంగిపోయాడు. పూర్వజన్మ పుణ్యం పోతనది కాదు, తెలుగు జాతిది అనిపించేలా భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. భారత భాగవతాలు రెండూ తెలుగు భాషకు జవసత్వాలను అందించాయి. జాతి సంస్కృతి ముంగిట ధ్వజస్తంభాలుగా నిలిచాయి.

అనువాదం అమ్మలతోనే ఆరంభం

భారతానువాదాన్ని భారతం అనే వేదంగా నిర్మించి, కవిత్రయంవారు అనువాద 'ప్రక్రియ'కు శ్రీకారం చుట్టినా, అనువాద 'కళ' అమ్మలతోనే ఆరంభమైందని చెప్పుకోవాలి. పసిపిల్లలు చిత్రవిచిత్ర హావభావాలతో తీపి కబుర్లు చెబుతుంటే, పరాయివారికి ఆ ఉంగా భాష ముద్దుగా తోస్తుంది తప్ప అర్థం కాదు. వాటిని అమ్మలు మాత్రం తేలిగ్గా అనువదిస్తారు. సాహిత్యలోకంలో మూలగ్రంథాల్లోని అంతర్లీన సంగీత మాధుర్యం అనువాదాలకు చిక్కడం చాలా అరుదు. 'శబ్దంబనుసరించియు, భావంబు ఉపలక్షించియు, రసంబు పోషించియు, అలంకారంబు భూషించియు, ఔచిత్యంబు ఆచరించియు...' అంటూ శ్రీనాథుడు అనువాదకళకు ప్రాణప్రదమైన కొన్ని లక్షణాలను నిర్వచించాడు. ఈ ప్రక్రియకు సంబంధించి శ్రీనాథుడిదే సర్వసమగ్ర నిర్వచనమని ప్రముఖ పరిశోధకులు ఆచార్య గంగిశెట్టి అభిప్రాయం. పరమశివుణ్ని స్తుతిస్తూ బిల్హణుడు సంస్కృతంలో చెప్పిన 'పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ' అనే శ్లోకపాదంలోని అద్భుతమైన నడకకు ముగ్ధుడైపోయిన శ్రీనాథుడు- హరవిలాస కావ్యంలో ఆ పంక్తిని యథాతథంగా నిబంధించాడు. దాంతో సరిపెట్టకుండా మూడో పాదంలో 'మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్‌...' అంటూ తనదైన ముద్రను ప్రతిష్ఠించడం శ్రీనాథుడి గడుసుదనం. దీన్ని ఆచార్య బేతవోలు 'ఒక మహా ధానుష్కుడు తన శరాఘాతంతో చేసిన రంధ్రంలోంచి మేటి విలుకాడు తిరిగి బాణం వేయడం'గా చమత్కరించారు. తూర్పుదిక్కున ఉదయిస్తున్న బాలభానుణ్ని సంస్కృతకవులు చాలామంది రమణీయంగా వర్ణించారు. తెలుగులోకి వచ్చేసరికది 'ప్రాచీ వధూటికా ఫాలభాగంబున పెట్టిన కెంపుల బొట్టు'(కొరవి గోపరాజు), 'పూర్వసంధ్యాంగనా ఫాలభాగంబున చెలువారు సింధూర తిలకము(శ్రీనాథుడు) వంటి అందమైన రూపాలు ధరించింది. హస్తవాసి బాగుంటే అనువాదం మూలంకన్నా సొగసుగా ఉంటుంది.

అనువాదానికి ఎన్నో పేర్లు

అనువాద ప్రక్రియకే ఆయా విధానాలను అనుసరించి భాషాంతరీకరణ, పరివర్తన, రూపాంతరీకరణ, అనుసృజన, అనుకరణ, ఆంధ్రీకరణ... వంటి ఎన్నో పేర్లు ఏర్పడ్డాయి. ప్రాచీన ఆలంకారికుడు రాజశేఖరుడు- శబ్దహరణోపాయాలు అర్థహరణోపాయాలంటూ కావ్యమీమాంసలోని మూడు అధ్యాయాల్లో వాటిని వివరించాడు. ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా భాషాపరమైన మహాసౌందర్యాలు అనువాదంలోకి పూర్తిగా రావు. 'స్థాన విశేష మాత్రమున తామరపాకున నీటి బొట్టనన్‌' అన్నట్లుగా అయితే, కవి కీర్తినిబట్టి కొన్ని చలామణీ అవుతాయి. కాళిదాసు శాకున్తలంలో దుష్యంతుడు శకుంతలను తొలిసారిగా ముద్దాడే ఘట్టం ఉంది. నాలుగు పెదవులూ ఇక కలుస్తాయనగా ఏదో అవాంతరం ఏర్పడి ఏకాంతం భగ్నమవుతుంది. ఆ శ్లోకపాదాన్ని కాళిదాసు 'న చుంబితం తు' అని ముగించాడు. ఆఖరి అక్షరంలోని పెదాల భంగిమను, రస స్ఫురణను వీరేశలింగం అంతటి పండితుడే తెలుగులోకి రప్పించలేకపోయారు. 'ముద్దిడలేకపోతి' అని సరిపెట్టారాయన.

'సార'తో 90శాతం సొగసు

అలా అని లోకంలో అనువాదాలు ఆగిపోవు. వాల్మీకి రామాయణం మొదలు రవీంద్రుడి గీతాంజలి వరకు ఎన్ని ప్రయత్నాలో! అలాంటివారికి తాము ఉపయోగపడతామంటోంది హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం. రెండేళ్లపాటు శ్రమించి రూపొందించిన 'సార' అనే అనువాద టూల్‌తో 90శాతం సొగసును రప్పించగలరట. దాని సాయంతో 'క్షణహోత్తు ఆణిముత్తు' అనే కన్నడ గ్రంథాన్ని 'క్షణకాలం ఆణిముత్యం'గా తెలుగులోకి కొద్ది క్షణాల్లోనే అనువదించి జేజేలు అందుకున్నారు. 'సా'రాన్ని 'ర'సాన్ని సార ఒడిసి పట్టుకుందని పరిశీలకులు సంతృప్తి వెలిబుచ్చారు. 'కవితా కన్యక గుణములు చవులూరగ మీకు నేను జతపరచెదగా' అని సవాలుచేస్తున్న 'సార'కు వారు సాదరంగా స్వాగతం చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details