తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ఓటమి తథ్యం : ముఖాముఖిలో రాహుల్​ - congress party

ఎన్డీఏ ఐదేళ్ల పాలనలో దేశం సంక్షోభాల భారతంగా మారిందని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఈ సంక్షోభాలే మోదీ ఓటమికి కారణాలు అవుతాయని జోస్యం చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ ​ వ్యూహాలు, ప్రచారం, హామీలపై 'ఈనాడు' ముఖాముఖిలో మరిన్ని వివరాలు చెప్పారు.

మోదీ ఓటమి తథ్యం : ముఖాముఖిలో రాహుల్​

By

Published : Mar 23, 2019, 5:08 PM IST

Updated : Mar 23, 2019, 8:10 PM IST

రాహుల్​ గాంధీ.. కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు. కేంద్రంలోని భాజపాను గద్దె దించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న నేత. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని లోక్​సభ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలకు పదునుపెట్టారు. కాంగ్రెస్​ విధానాలను, హామీలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​ అనుసరించే వ్యూహాలు, ఇవ్వబోయే హామీలపై తన ఆలోచనల్ని 'ఈనాడు' ముఖాముఖిలో పంచుకున్నారు రాహుల్.

రానున్న ఎన్నికల్లో ఏవి ప్రధానాంశాలు కాబోతున్నాయి?

మోదీ అనేక హామీలిచ్చారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని అన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలంటూ మాటలు చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని అన్నారు. వీటిలో ఒక్కటీ అమలు చేయలేదు. అంతా ప్రచార ఆర్భాటమే. ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సంతోషంగానే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ దేశ ప్రజలు భాజపా పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగాల్లేక యువత అసంతృప్తిగా ఉంది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయి. ప్రజాస్వామ్యం, సామరస్యం ప్రమాదంలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ ప్రధానమవుతాయి.

ప్రధాని మోదీ 'చౌకీదార్​' ఉద్యమంపై ఏమంటారు?

చౌకీదార్​ నినాదంతో తన పనితీరును స్పష్టంగా ఒప్పేసుకున్నారు మోదీ. పేదలకు కాపలాదారులు(చౌకీదారులు) ఉండరు. ఈ నినాదంతో తాను ధనవంతుల కోసమే పని చేస్తున్నట్టు అంగీకరించారు ప్రధాని. దేశానికి కాపలాదారుడినంటూ చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి దోపిడీ చేస్తూ చిక్కారు. బడా వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు ఎలా వెళ్లాయన్నది ఆయన ప్రజలకు చెప్పాలి. అనిల్‌ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు, అలాంటి మరికొందరికి ఆయన కాపలాదారు.

'చౌకీదార్​ చోర్ ​హై' నినాదం ప్రజల్లోకి వెళ్లిందా?

‘చౌకీదార్‌ చోర్‌ హై’ అన్న మా నినాదం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. దాన్ని భాజపా అంగీకరించిందనే అనుకుంటున్నా. అందుకే మోదీ పాట్లు పడుతున్నారు. మై బీ చౌకీదార్​ అంటూ కొత్త నినాదాలు తెస్తున్నారు. ట్విట్టర్​లో చౌకీదార్​గా పేరు మార్చుకుంటున్న భాజపా నేతలు... ప్రధానమంత్రి మోదీ సహా మంత్రులు పీయూష్‌ గోయల్‌, అరుణ్‌జైట్లీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆయన కుమారుడు జైషా.. అవినీతిలో కూరుకుపోయారు. దేశ సంపదను దోచుకుంటున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు చౌకీదార్లమంటూ బీరాలు పలుకున్నారు. ఈ దేశ చౌకీదార్‌ దొంగ అన్న సత్యం అందరికీ తెలిసిపోయింది.

ఇదీ చూడండి :భారత్​ భేరి: కూటమికే 'కింగ్​ మేకర్'​ ఓటు

రఫేల్​ను అస్త్రంగా చేసుకుంటారా?

రఫేల్​ ఒప్పందంలో అవినీతి తీవ్రమైన అంశం. తన మిత్రుడు అనిల్‌ అంబానీకి రూ. 30వేల కోట్లు దోచిపెట్టేందుకు మోదీ దేశ రక్షణను ప్రమాదంలో పెట్టారు. అంబానీతో ఒప్పందానికి ప్రధాని ఒత్తిడి తెచ్చినట్లు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడే అంగీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉండగా, ప్రధానిని రక్షించాలని దాచిపెడుతున్నారు. కొత్త రఫేల్‌ ఒప్పందం వల్ల విమానాల సంఖ్య తగ్గింది. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. సమయం వృథా అవుతోంది. ఇది దేశరక్షణకు ముప్పు. ఈ అంశం ఎన్నికల్లో ప్రధానమైందే.

లోక్​సభ ఎన్నికలను మీరిచ్చే ముఖ్యమైన హామీలేవి?

మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. అందులో కనీస ఆదాయ హామీ పథకం ప్రధానమైనది. పేదరిక నిర్మూలనకు ఈ పథకం ఎంతో ముఖ్యం. ఏ ఒక్కరూ కనీస ఆదాయం కంటే దిగువన జీవనం సాగించకూడదు. దాని కంటే దిగువన ఉంటే ఆ మేరకు వారికి ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేస్తుంది. హరిత విప్లవం, జాతీయ ఉపాధి హామీ చట్టం చేసినట్లుగానే ఇదీ ఉంటుంది. విద్యకు జీడీపీలో 6% నిధులు కేటాయిస్తాం. ఆరోగ్య రంగానికీ ప్రాధాన్యమిస్తాం. రైతుల రుణాలు మాఫీ చేస్తాం.

మహిళల సాధికారతకు ఏ చర్యలు తీసుకుంటారు?

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభలో ఆమోదిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కేటాయిస్తాం. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తోడ్పాటు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గతంలో మా ప్రభుత్వం దీన్ని చేసి చూపించింది. ఉద్యోగాల కల్పనతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా మహిళలను ప్రోత్సహిస్తాం.

నల్లధనం సమస్యపై మీ వ్యూహం ఏమిటి?

నల్లధనానికి అవినీతే కారణం. ఆ అవినీతికి ప్రధాన కారణం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఈ విషయంలో ప్రధాని పోస్టర్‌బాయ్‌లా మారారు. బ్యూరోక్రాట్ల చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమయ్యాయి. ఆ అధికారాలే వారికి అయాచిత ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారమిస్తున్నాయి. ముందు రాజకీయ పార్టీలకు నిధులందే విధానాన్ని ప్రక్షాళన చేయాలి. ఎన్నికల బాండ్లు మరింత అవినీతికి ఆస్కారమిస్తున్నాయి.

నోట్ల రద్దుపై మీ అభిప్రాయం? అది అవినీతికి పరిష్కారమా?

రూ.2 వేల నోటు నిషేధం అవినీతి సమస్యకు పరిష్కారం కాదు. 2016లో చేసిన పెద్దనోట్లను రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. మరోసారి అలా చేయడం తెలివి తక్కువ ప్రయత్నమే అవుతుంది. అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొనే ప్రధానమంత్రి రూ.వెయ్యి నోటు రద్దు చేసి రూ.2 వేల నోటు తీసుకువచ్చారు.

ఇదీ చూడండి:కంచుకోట​లో కమ్యూనిస్టుల అస్తిత్వ పోరాటం

Last Updated : Mar 23, 2019, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details