మరో రోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల 50డిగ్రీల ఉష్ణోగ్రతను దాటుతూ బెంబేలెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో నైరుతి రుతుపవనాల రాక మరో రోజు ఆలస్యమవుతుందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ.
జూన్ 6నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని గతంలోఅంచనావేసిన వాతావరణ విభాగం... తాజాగా 7వ తేదీ వరకు వేచి చూడకతప్పదని వెల్లడించింది.
మరోవైపు... ప్రెవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమేట్.. ఇదే తేదీతో తన అంచనాలను సవరించింది. భూమధ్య రేఖ వద్ద ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల రానున్న 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతం., మాల్దీవుల మీదుగా రుతుపవనాలు మరింత ముందుకు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.
సముద్రమట్టానికి... 3.1 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ పీఠభూమిపై ఆవరించి ఉన్న ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనుకూలత వల్ల రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేసింది.