భారత్-చైనా మధ్య సంబంధాలను పునర్నిర్మించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిర్ణయించారు. తమిళనాడు వేదికగా జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు కోవలంలో ఇద్దరు దేశాధినేతలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. భవిష్యత్తులోనూ అనధికారిక చర్చలు కొనసాగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.
కొత్త అధ్యాయం
ఈ భేటీతో చైనా-భారత్ మధ్య సంబంధాల విషయంలో కొత్త అధ్యాయం మొదలు కానుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వుహాన్ సదస్సు స్ఫూర్తితో చెన్నై వేదికగా జరిగిన ఈ భేటీతో పరస్పరం విశ్వాసం పెరిగిందని తెలిపారు.
ఏకాంత సమావేశం తర్వాత ఇరువురు నేతలు సముద్రతీరంలో కలియతిరిగారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల్లో మోదీ-జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ భేటీకి విదేశాంగ మంత్రి జయ్శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే హాజరయ్యారు.
పూర్వం నుంచి చెన్నై టూ చైనా..
తమిళనాడుతో చైనాకు పూర్వం నుంచే సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. 2 వేల ఏళ్ల క్రితమే భారత్, చైనా ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలుగా ప్రస్థానం సాగించాయని చెప్పారు. చర్చలు ఫలవంతంగా సాగాయని మోదీ ట్వీట్ చేశారు.
"రెండో అనధికారిక సదస్సు కోసం భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు. భారత్, చైనా సంబంధాలకు చెన్నై సదస్సు ఊతం ఇవ్వనుంది. ఇది మన దేశంతో పాటు ప్రపంచానికి లబ్ధి చేకూర్చుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
చర్చల అనంతరం మోదీ-జిన్‌పింగ్ కలిసి భోజనం చేశారు. ఈ భేటీ సందర్భంగా భారత్ ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని జిన్‌పింగ్ అన్నారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారం పెరగాలని ఆకాంక్షించారు. సదస్సు పూర్తయ్యాక తమిళనాడు నుంచి చైనా బయలుదేరారు జిన్‌పింగ్.