నూతన పార్లమెంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ పనులు ప్రారంభించేందుకు భూమి పూజ చేయనున్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. 66,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 971 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందని, ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1,224 మంది కూర్చునేలా భవన ప్రణాళిక ఉంటుందని స్పీకర్ తెలిపారు.
భూమి పూజ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించనున్నట్లు తెలిపారు ఓంబిర్లా. కొందరు వర్చువల్గా, మరికొందరు నేరుగా హాజరవుతారని చెప్పారు. ప్రత్యక్షంగా రెండు వేల మంది, పరోక్షంగా తొమ్మిది వేల మంది భవన నిర్మాణంలో పాలుపంచుకుంటారని వెల్లడించారు.
"ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. కొత్త భవనాన్ని సొంతంగానే నిర్మించుకొని ఆత్మనిర్భర్ భారత్కు ఉదహరణగా నిలవడం భారతీయుల కళ. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త భవనం ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యే సంవత్సరం(2022)లో పార్లమెంటు సమావేశాలు.. కొత్త భవనంలో జరుగుతాయని ఆశిద్దాం."
-ఓంబిర్లా, లోక్సభ స్పీకర్
భూకంపానికి తట్టుకునేలా నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు స్పీకర్ ఓంబిర్లా. పూర్తి అధునాతన వ్యవస్థలతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని వారసత్వ పురావస్తు ఆస్తిగా సంరక్షిస్తామని స్పష్టం చేశారు.