73వ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశం ముస్తాబవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయనున్నారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించనున్నారు.
భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ ప్రసంగించడం ఇదే తొలిసారి. మొత్తం మీద మోదీకి ఇది 6వ ప్రసంగం కానుంది.
జమ్ముకశ్మీర్... ఆర్థిక వ్యవస్థ!
స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, మానవ సహిత అంతరిక్ష మిషన్ వంటి అంశాలను మోదీ తన వార్షిక ప్రసంగాల్లో ఇప్పటి వరకు ప్రస్తావించారు. వీటితో పాటు తన ప్రభుత్వ ప్రగతి నివేదిక, దేశాభివృద్ధిపైనా ఇన్నేళ్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత వారమే జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి... ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలకు హామీనిచ్చారు. ఇదే అంశంపై ఆగస్ట్ 15న మోదీ ప్రసంగిస్తారని ఎన్నో రోజులుగా అందరూ భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా మోదీ మాట్లాడతారని సమాచారం.