మెరుపుదాడులతో పాకిస్థాన్‌కు భారత్ దీటైన జవాబిచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి పుల్వామా ఘటనకు బదులుతీర్చామని మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ర్యాలీ వేదికగా మోదీ స్పష్టం చేశారు. ఉగ్రకార్యకలాపాలను నియంత్రించకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ను హెచ్చరించారు మోదీ.
వైమానిక దాడులకు రుజువులు కోరుతున్న విపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. పాక్‌లో దాడి జరిగితే విపక్ష నాయకులకు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. మహాకూటమిని ఉద్దేశించి 'మహా మిలావత్' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మహాకూటమి నేతల్ని పాకిస్థాన్‌కు ప్రచార కర్తలుగా అభివర్ణించారు మోదీ.
ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు "ప్రతిపక్షాలు వైమానిక దాడులు, మెరుపు దాడులను శంఖిస్తున్నాయి. వారి ప్రభుత్వం ఉన్నప్పుడేం జరిగింది? ప్రస్తుతం మనం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నాం. స్లీపర్ సెల్స్‌ని మట్టుబెడుతున్నాం. ఈ దాడుల అనంతరం ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయి లేదంటే సైనికులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌లో మహాకూటమి ఏర్పాటు చేసిన నేతలు.. ప్రస్తుతం అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మోదీపై ఆరోపణలు గుప్పిస్తుంటే అక్కడ పాక్‌లో వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. పాక్ పత్రికల్లో శీర్షికలుగా ప్రతిపక్షనేతల వ్యాఖ్యల్ని ప్రచురిస్తున్నారు. వారి టీవీల్లో చూపిస్తున్నారు. మహాకూటమి నేతలు పాక్ ప్రచారకర్తలుగా మారారు." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి