దేశ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ ప్రథమార్ధంలో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ సహా మొత్తం ఐదు విగ్రహాలను తాత్కాలికంగా అక్కడి నుంచి తరలించనున్నట్లు చెప్పారు. నూతన భవనం పూర్తయ్యాక.. ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించనున్నట్లు స్పష్టం చేశారు.
16 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ప్రస్తుత పార్లమెంట్ ఒకటో గేట్ ఎదురుగా ఉంది. పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఈ ప్రదేశమే కేంద్ర బిందువుగా ఉంది.