తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ కుల్ఫీ'... అభిమానానికి చల్లటి రూపం - సూరత్​

గుజరాత్​ సూరత్​లో ఓ ఐస్​క్రీమ్​ పార్లర్​​ 50 శాతం రాయితీతో కుల్ఫీలు విక్రయిస్తోంది. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ గెలిచిన సందర్భంగా కుల్ఫీలపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖాన్ని ముద్రించి  విక్రయిస్తున్నారు. వీటికి 'మోదీ సీతాఫల్​ కుల్ఫీ' అని పేరు పెట్టారు.

మోదీ 'కుల్ఫీ' - అభిమానం చాటిన గుజరాత్​వాసి

By

Published : May 28, 2019, 4:49 PM IST

మోదీ 'కుల్ఫీ'

ప్రస్తుతం దేశంలో ఎటుచూసినా 'నమో' జపమే వినపడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా మోదీ నినాదాలు హోరెత్తుతున్నాయి. గుజరాత్​లో మోదీపై అభిమానం మరింత పెరిగిపోయింది. అనేక విధాలుగా నరేంద్రుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు గుజరాత్​వాసులు. తాజాగా సూరత్​లోని ఓ ఐస్​క్రీమ్​ పార్లర్​​ యజమాని... కుల్ఫీలపై మోదీ ముఖాన్ని రూపొందించి విక్రయిస్తున్నాడు. సీతాఫలం రుచి ఉండే వీటికి 'మోదీ సీతాఫల్​ కుల్ఫీ' అని పేరు పెట్టాడు. ఈ కుల్ఫీలకు విశేష ఆదరణ లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

"మోదీ గెలిచిన సందర్భంగా మేము 'మోదీ సీతాఫల్​ కుల్ఫీ'ని తయారు చేశాం. ప్రకృతిసిద్ధ పదార్థాలే వినియోగిస్తున్నాం. సీతాఫలం రుచి ఉంటుంది. ఒక్క కుల్ఫీ తయారీకి 24 గంటలు పడుతుంది. ఇందుకోసం ఎంతో శ్రమించాం. చివరకు మా శ్రమ ఫలించింది. కుల్ఫీకి మంచి ఆదరణ లభిస్తోంది."
- వివేక్​ అజ్మేర, యజమాని.

కుల్ఫీ తయారీ కోసం ఎలాంటి యంత్రాలను ఉపయోగించలేదని.. చేతులతోనే తయారు చేస్తున్నామని తెలిపాడు వివేక్​.

సరికొత్త కుల్ఫీలు హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కుల్ఫీ రుచి అదిరిపోయిందని తిన్నవారు అంటున్నారు.

ప్రమాణస్వీకారం వరకే..

ఒక్కో కుల్ఫీ ధర రూ 250. కానీ 50శాతం రాయితీతో కుల్ఫీలు అమ్ముతున్నాడు వివేక్​. ఇప్పటికే 200 కుల్ఫీలు అమ్ముడుపోయాయి. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకు 'మోదీ సీతాఫల్​ కుల్ఫీ' అందుబాటులో ఉంటుందని యజమాని వివేక్​ తెలిపాడు.

ఇదీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్​... ఇప్పుడు మోదీ: రజనీ

ABOUT THE AUTHOR

...view details