'స్వచ్ఛభారత్, మెరుపు దాడులంటే కాంగ్రెస్‌కు కడుపునొప్పి' కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి పాలనలో రైతులు, జవాన్లు, క్రీడాకారులకు రక్షణ ఉండేది కాదని ఆరోపించారు. వ్యవసాయం, క్రీడా రంగాల్లోనూ అవినీతి జరిగేదని ధ్వజమెత్తారు.
హరియాణాలోని సోనిపత్ జిల్లా గోహానాలో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
"ఆగస్టు 5 నుంచి జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యంగం పూర్తిగా అమల్లోకి వచ్చేలా చేశాం. కశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అప్పటి నుంచి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్ష నేతలు భరించలేని కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి తగ్గించడానికి ఏ ఔషధమూ పనిచేయడం లేదు. కాంగ్రెస్‌కు ఎలాంటి బాధ వచ్చిందంటే... మనం స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే వారికి కడుపునొప్పి వస్తుంది. మెరుపుదాడిని ప్రస్తావిస్తే వారి బాధ మరింత తీవ్రమవుతుంది. పొరపాటున ఎవరైనా బాలాకోట్ పేరు చెబితే ఇక కాంగ్రెస్ నేతలు భరించలేని నొప్పితో ఎగిరిపడతారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
తీవ్రవాదంపై పోరులోనైనా, రెజ్లింగ్ రింగ్‌లో పోరాటానికైనా సోనిపత్ ప్రాంతం దేశానికి గర్వకారణమని కొనియాడారు మోదీ. రైతులు, జవాన్లు, రెజ్లర్లకు సోనిపత్ మారుపేరని అభివర్ణించారు.
ఇదీ చూడండి-పాపాల పాకిస్థాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ 'బ్లాక్‌లిస్ట్' ముప్పు!