ఈ ఎన్నికలు సస్యశ్యామలమైన, సమృద్ధికరమైన, దృఢమైన భారత్‌ను నిర్మించేందుకు జరుగుతున్న ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం తాను చీపురు పట్టి ఊడిస్తే విపక్షాలు తనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాయన్నారు. తనను తక్కువ చేసి చూపేందుకు విపక్షాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయన్నారు.
ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు...
మహాకూటమిలో డజను మంది నేతలు ప్రధాని పదవికోసం ఆశపడుతున్నారని, అందరూ ప్రమాణస్వీకారానికి ధరించేందుకు నూతన వస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ.
'ప్రపంచంలో భారత్ స్థానాన్ని నిర్ణయించే ఎన్నికలివి' "దేశం యావత్తూ నవభారత నిర్మాణం కోసం ఏకమైంది. కొద్ది రోజుల ముందు వరకు విపక్షాలు మోదీపై విమర్శలు గుప్పించటంలో పోటీ పడ్డాయి. మహాకూటమి నేతలు ఒక నూతన ప్రణాళిక రచించారు. ప్రపంచంలోని డిక్షనరీల నుంచి తీసి విమర్శలు గుప్పించేవారు. వారి మధ్య పోటీ నెలకొంది... ఎవరు ఎక్కువ విమర్శలు చేస్తారు? ఎవరు పెద్ద విమర్శలు చేస్తారు? అన్న పోటీ ఉండేది. కానీ వారు ప్రస్తుతం మౌనంగా కూర్చున్నారు. దాని అర్థం మరోసారి మోదీ పాలన.. వస్తుందనే. సస్యశ్యామలమైన, సమృద్ధికరమైన, దృఢమైన భారత్‌ను నిర్మించేందుకు జరుగుతున్న ఎన్నికలివి. ప్రపంచంలో భారత స్థానం ఏమిటో నిర్ణయించే ఎన్నికలివి."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి:'మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై'