73వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోట త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ శత్రు దుర్భేద్యంగా మారింది. పటిష్ఠ భద్రత మధ్య ప్రధాని మోదీ నేడు ఆరోసారి ఎర్రకోటపై మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
మోదీ ప్రసంగం వీటిపైనే..!
73వ స్వాతంత్ర్య దినోత్సవంలో మోదీ ఎలాంటి సందేశం ఇస్తారోనని దేశమంతా ఎదురుచూస్తోంది. ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ.. జమ్మూకశ్మీర్ నుంచి దేశంలో ప్రస్తుత ఆర్థికస్థితి వరకు అనేక అంశాలపై ప్రసంగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, అంతరిక్ష ప్రయోగాలను గురించి ప్రధాని జాతికి వివరించే అవకాశం ఉంది. తన హయాంలో దేశాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తూ.... మోదీ ప్రగతి నివేదిక సమర్పించనున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తర్వాత వరుసగా ఆరోసార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందనున్నారు. ఆర్థిక మందగమనంపై ఉన్న ఆందోళనలను కూడా మోదీ ఈ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు
ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలకు హామీనిచ్చిన మోదీ ఈ అంశంపై కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక సందేశమిచ్చే ఆవకాశాలూ లేకపోలేదు.
పటిష్ఠ భద్రత నడుమ దేశ రాజధాని..
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలో.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా రెడ్‌అలర్ట్ ప్రకటించిన కేంద్రం.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధాని మోదీ జెండా ఆవిష్కరించనున్న ఎర్రకోటను భద్రతా దళాలు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎర్రకోట ప్రవేశ మార్గాల వద్ద పెద్ద సంఖ్యలో తొలిసారి ఫేస్‌రికగ్నైజ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గాల్లో దాడులను నిరోధించడానికి.. ఎర్రకోట పరిసరాల్లో యాంటీ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.